లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

నంద్యాలలో అబ్దుల్ సలాం ఇంటి దగ్గర భారీ బందోబస్తు, డిప్యూటీ సీఎం పరామర్శ

Published

on

abdul salam: కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసు ఏపీలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అబ్దుల్ ఇంటి దగ్గర పోలీసులను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, వివిధ సంఘాల నాయకులు అబ్దుల్ సలాం ఇంటికి చేరుకున్నారు. అబ్దుల్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని సంఘాల నేతలు డిమాండ్ చేశారు. గోల్డ్ షాప్ లో జరిగిన దొంగతనం కేసుని విచారించాలని కోరారు. మరోవైపు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అబ్దుల్ సలాం కుటుంబసభ్యులను పరామర్శించారు.

నంద్యాల సీఐ, హెడ్ కానిస్టేబుల్ అరెస్ట్:
నంద్యాలలో అబ్దుల్ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్న కేసుకు సంబంధించి నంద్యాల సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. ఐజీపీ శంఖబ్రత బాగ్చి, ఐపీఎస్ అధికారి అరిఫ్ విచారణ ప్రారంభించారు. తప్పు చేస్తే ఎంతటి వారైనా వదిలి పెట్టే ప్రసక్తి లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు.

రైలు కింద పడి కుటుంబం ఆత్మహత్య:
కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చెందిన షేక్ అబ్దుల్ సలాం ఆటో డ్రైవర్. అతడి కుంటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. షేక్ అబ్దుల్ సలాం (45), అతని భార్య నూర్జహన్ (38)తో పాటుగా 14 ఏళ్ల కూతురు సల్మా, 12 ఏళ్ల కుమారుడు దాదా కలందర్ కర్నూలు జిల్లా పాణ్యం మండలం కౌలూరు రైల్వే స్టేషన్‌ దగ్గర ఆత్మహత్య చేసుకున్నారు. వారంతా గూడ్స్ రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నారు. ఆర్థిక సమస్యలతో వారు ఆత్మహత్య చేసుకున్నారని తొలుత అంతా భావించారు. అయితే, పోలీసుల వేధింపులే కారణమనే ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి సమయంలో కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి ముందు అబ్దుల్ సలాం తీసిన సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. పోలీసుల వేధింపుల వల్లే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని సలాం అందులో తెలిపాడు.

ఆటోలో రూ.70వేలు పోయాయనే ఫిర్యాదుతో వేధింపులు:
అబ్దుల్ సలాం గతంలో ఓ దొంగతనం కేసులో నిందితుడు. ఓ బంగారం దుకాణంలో కూడా పనిచేశాడు. దొంగతనం ఆరోపణలతో ఉద్యోగం పోయింది. జైలుకెళ్లి వచ్చిన తర్వాత ఆటో అద్దెకు తీసుకుని నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, అదే ఆటోలో తన రూ.70వేలు పోయాయంటూ ఓ ప్రయాణికుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు అతడిని వేధింపులకు గురి చేసినట్టు అతడి బంధువులు ఆరోపిస్తున్నారు.

సెల్ఫీ వీడియోలో ఏముంది?
‘ఆటోలో జరిగిన రూ. 70వేల దొంగతనం, బంగారం షాపులో జరిగిన దొంగతనంలో నాకు సంబంధం లేదు. అయినా నేను చేయని దొంగతనంలో నన్ను వేధిస్తున్నారు. నాపై ఒత్తిడి పెంచుతున్నారు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా. నాకు చావు తప్ప మరో దారి లేదు’ అంటూ సెల్ఫీ వీడియోలో ఇద్దరు బిడ్డలు, భార్యతో కలిసి కన్నీరుమున్నీరవుతూ అబ్దుల్ సలాం చెప్పాడు.

సీఎం జగన్ సీరియస్:
అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనను సీఎం జగన్‌ తీవ్రంగా పరిగణించారు. మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సంఘటన తన దృష్టికి వచ్చిన వెంటనే వేగంగా స్పందించిన సీఎం జగన్.. బాధ్యుల మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్వయంగా డీజీపీ, ఇంటలిజెన్స్ చీఫ్‌లతో మాట్లాడిన సీఎం, ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు కోసం ఇద్దరు ఐపీఎస్‌లు, బెటాలియన్స్‌ ఐజీ శంకబ్రత బాగ్చీ, గుంటూరు అడిషనల్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ను నియమించారు. షేక్‌ అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్యకు బాధ్యులుగా గుర్తించిన సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ గంగాధర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *