ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు సహా కీలక నేతలు అరెస్ట్, 144 సెక్షన్ విధింపు.. అమలాపురంలో హైటెన్షన్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి రథం దగ్ధం ఘటనకు నిరసనగా రాష్ట్రంలో బిజేపి, జనసేన, ధార్మిక సంఘాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రథం దగ్ధం ఘటనపై సమగ్ర విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించడానికి జీవో ఇచ్చినప్పటికీ.. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా బీజేపీ తన ఆందోళన కొనసాగిస్తూ వస్తోంది.

ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు ఇవాళ(సెప్టెంబర్ 18,2020) ఛలో అమలాపురం కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అంతర్వేది ఘటనతో పాటు రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై సమగ్ర విచారణ జరిపించాలంటూ అమలాపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నాకు పిలుపునిచ్చారు.

బిజేపి నాయకులు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఛలో అమలాపురం నిర్వహించి తీరుతామని తేల్చి చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా బిజేపి నాయకులను హౌస్ అరెస్టులు, ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఏపి బిజేపి అధ్యక్షులు సోము వీర్రాజును విజయవాడలో అరెస్టు చేయగా, తిరుపతి, విశాఖపట్నంకు చెందిన ముఖ్య నాయకులను కూడా హౌస్ అరెస్ట్ చేసారు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న బిజేపి నాయకులను హౌస్ అరెస్ట్ చేసారు. బిజేపి ఆందోళనకు మద్దత్తుగా అమలాపురం చాంబర్ ఆఫ్ కామర్స్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపధ్యంలో నేడు అమలాపురం సబ్ డివిజన్ లో వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి.

రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం చూసీ చూడనట్టు వ్యవహరిస్తుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను పట్టుకోవాల్సింది పోయి.. శాంతియుతంగా నిరసన తెలిపిన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వానికి ఏమైందో.. జగన్‌ సర్కార్‌కి కూడా అదే గతి పడుతుందని మండిపడ్డారు.

ఇటు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్ తో పాటు ఇటీవల అంతర్వేదిలో జరిగిన ఘటనలను దృష్టి లో పెట్టుకుని పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా అమలాపురం సబ్ డివిజన్ లో సెక్షన్ -144, పోలీసు యాక్ట్ 30 అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. అందువల్ల ఎలాంటి ధర్నాలు, నిరనసలు, ఆందోళనలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు బీజేపీ నేతలు తగ్గేదే లేదంటున్నారు. దీంతో అమలాపురంలో ఏం జరుగుతోందనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.

చలో అమలాపురం కార్యక్రమం ఉద్రిక్తలకు దారి తీసింది. బీజేపీ నేతలు ఒక్కసారిగా మెరుపు ఆందోళనకు దిగారు. అమలాపురం గడియారం స్తంభం దగ్గర బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు అడ్డురావడంతో అక్కడ ఒక్కసారిగా టెన్షన్‌ వాతావరణం కనిపించింది. పరిస్థితి అదుపు తప్పడంతో బీజేపీ మహిళ నేత యామిని శర్మతో పాటు మరికొందరు నేతలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు పోలీసులు.

చలో అమలాపురం కార్యక్రమానికి ప్రభుత్వ ఆంక్షలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రజాస్యామ్యంలో భావప్రకటనా స్వేచ్ఛ అడ్డుకోవడం దారుణమని మండిపడుతున్నారు నేతలు. ఎన్ని ఆంక్షలు పెట్టినా చలో అమలాపురం కొనసాగుతుందన్నారు. పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవర్నీ అనుమతించేది లేదన్నారు. కోనసీమ ప్రాంతంలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నాయని చెప్పారు. ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అటు బీజేపీ పంతం.. ఇటు పోలీసుల ఆంక్షల నేపథ్యంలో చాలాచోట్ల పరిస్థితులు ఉద్రిక్తకు దారి తీసాయి.

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం గడియారం స్థంభం వద్దకు చేరుకున్న బీజేపీ నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ నిరసనను తెలియజేయడానికి వచ్చిన బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


Related Posts