Home » చైనాలో కరోనా పుట్టలేదనడం “అత్యంత ఊహాజనితమే”: WHO
Published
2 months agoon
‘Highly speculative’ to say COVID-19 did not emerge in China చైనాలో కరోనా వైరస్ ఉద్భవించలేదని తాము చెప్పడం అత్యంత ఊహాజనితమవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)లోని ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైక్ ర్యాన్ అన్నారు. మానవుల్లో మొదట వైరస్ బయటపడిన ప్రాంతం నుంచే దాని పుట్టుకపై పరిశోధన ప్రారంభించాలని మైక్ ర్యాన్ అభిప్రాయపడ్డారు. ఆ పరిశోధన ఇతర ప్రాంతాలకూ విస్తరించొచ్చు అని ఆయన వెల్లడించారు. జెనీవాలో జరిగిన ఆన్లైన్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
గతేడాది నవంబర్ లో చైనాలో మొదట కరోనా మహమ్మారిని గుర్తించారు. దానిపై వెంటనే సమాచారం ఇవ్వలేదని ప్రపంచ దేశాలు డ్రాగన్ దేశంపై విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనాకు డబ్ల్యూహెచ్ఓ వచ్చి కరోనా పుట్టుకపై అధ్యయనం చేయనుంది. ఈ క్రమంలో..ఆ వైరస్‌కు తమ దేశం జన్మస్థానం కాదంటూ చైనా కొత్త వాదనను ప్రచారం చేస్తోంది. తొలుత ఈ వైరస్ వుహాన్ నగరంలో కనిపించినంత మాత్రాన అది ఇక్కడే పుట్టిందని చెప్పలేమని అంటోంది.
అంతటితో ఆగకుండా కరోనా వైరస్ భారత్‌లోనే పుట్టిందని చైనా శాస్త్రవేత్తలు మరో సంచలనానికి తెరదీశారు. కరోనాను అడ్డంపెట్టుకొని ఇండియాపై మరోసారి బురద జల్లే ప్రయత్నం చేశారు. గత ఏడాది వేసవిలో ఈ వైరస్ భారత్ లో పుట్టిందని పేర్కొన్నారు. జంతువుల నుంచి కలుషిత నీటి ద్వారా మనుషులకు సంక్రమించి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అక్కడి నుంచి గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా వుహాన్‌కు వ్యాపించి ఉంటుందని పేర్కొన్నారు.
వుహాన్‌లో తొలి కేసు బయటపడడంతో.. అక్కడే వైరస్ పుట్టినట్లు అందరూ అపోహ పడుతున్నారని వెల్లడించారు. భారత్‌లో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం వల్లే చాలా రోజుల పాటు కరోనావైరస్ను గుర్తించలేకపోయారని నిందలు వేశారు చైనీస్ శాస్త్రవేత్తలు.