పద్మశ్రీకి అర్హుడే : 30ఏళ్లుగా దట్టమైన అడవిలో రోజూ 15 కి.మీ నడిచి వెళ్లి ఉత్తరాలు డెలివరీ చేసిన పోస్టుమ్యాన్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

దట్టమైన అడవి.. అందులో క్రూర మృగాలు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయో తెలియదు. ఇక మనిషి తప్పిపోయి ఒక్కసారి అడవిలోకి వెళితే వస్తాడో రాడో కూడా తెలియదు. అలాంటి అడవి గుండా 30 ఏళ్లుగా ఓ పోస్టుమ్యాన్‌ నడుచుకుంటూ వెళ్లి మారుమూల ప్రాంతాలకు ఉత్తరాలు అందించాడు. ఆ పోస్టుమ్యాన్ దట్టమైన అడవి ప్రాంతంలో 15 కిలోమీటర్లు నడుస్తూ అందరి మన్ననలను పొందాడు.

తమిళనాడుకు చెందిన పోస్ట్‌మాన్ డీ శివన్ పోస్టల్ శాఖలో పోస్టుమ్యాన్‌గా చేరినప్పటి నుంచి ఉద్యోగ విరమణ చెందేవరకు దాదాపు 30 ఏళ్ల పాటు దట్టమైన అడవి ప్రాంతంలో రోజూ ఏనుగులు, ఎలుగుబంట్లను దాటుకుంటూ జారే ప్రవాహాలు, జలపాతాలను అధిగమించి 15 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి ఉత్తరాలు, పెన్షన్ సొమ్ము పంచి వచ్చేవాడు. శివన్ ఎక్కువగా నీలగిరి పర్వతాలు, రైల్వే ట్రాక్‌ల వెంట నడుస్తూ వెళ్లి వచ్చేవాడు. కూనూర్ సమీపంలోని హిల్‌గ్రోవ్ పోస్ట్ ఆఫీస్ నుంచి ట్రెక్కింగ్ సమీప ప్రాంతాల్లో నివసించే తోటల కార్మికులకు ఉత్తరాలు, పెన్షన్లు పంపిణీ చేసేందుకు పోస్టుమ్యాన్ శివన్ వెళ్లాల్సి వచ్చేది. రిమోట్ ప్రాంతాల్లో పనిచేస్తుండడంతో సొరంగాలు, అటవీ ప్రాంతాల మీదుగా నడిచేవారు.

ఈ క్రమంలోనే తరచూ అడవి జంతువులను శివన్ ఎదుర్కొనేవాడు. కొన్ని సందర్భాల్లో అతడిని ఏనుగులు, ఎలుగుబంట్లు వెంబడించి తరిమిన సంఘటనలు ఉన్నాయి. ఆయన బెదరకుండా 30 ఏళ్లుగా అదే అడవి గుండా నడుచుకుంటూ వెళ్లీ తన విధులను నిర్వర్తించాడు.

ఇలా 30 ఏండ్ల పాటు తపాలా సేవలందించిన శివన్‌ గతవారం రిటైర్ అయ్యారు. అయితే పోస్ట్‌మాన్‌గా శివన్ అంకితభావం గురించి తెలుసుకున్న ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ఈ విషయాన్ని బుధవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అంకిత భావంతో తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన శివన్‌ను ప్రశసింస్తూ ఐఏస్‌ అధికారి సుప్రియా సాహు చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

నిబంద్ధతతో, అంకిత భావంతో పనిచేసిన శివన్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తూ పదవి విరమణ శుభకాంక్షలు తెలుపుతున్నారు. అతడు నిజమైన హీరో అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. దేశ నిర్మాణంలో అతని పాత్ర చాలా ప్రశంసించబడింది. అతని నిబద్ధతకు అభినందనలు. అతను పద్మ పురస్కారానికి అర్హుడు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. శివన్ ఇకపై ఆనందకర జీవితాన్ని గడపాలని వారు ఆకాంక్షించారు.

Related Posts