How coronavirus has affected China's Belt and Road plans

చైనా డ్రాగన్‌కు బెల్డ్ దెబ్బ.. కరోనా కాటు!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మూడు ఖండాలను రైలు రోడ్డు ప్రాజెక్టులతో కలపడానికి చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెల్ట్ రోడ్ ఇనీషియేటివ్ ప్రాజెక్టు కష్టాల్లో పడింది. కరోనా దెబ్బకు ఎక్కడికక్కడ పనులు ఆగిపోయాయి. మరోపక్క ఇందులో భాగంగా అనేక దేశాల్లో చేపట్టిన భారీ ఇన్ఫ్రా ప్రాజెక్టులు చైనాను పంటి నొప్పిలా పీడిస్తున్నాయి. లక్షల కోట్ల డాలర్లు తీసుకెళ్లి విదేశాల్లో పోస్తున్నందుకు దేశంలో దీనిపై వ్యతిరేకత పెరుగుతోంది. చైనా భవిష్యత్తు అవసరాల కోసం జింపింగ్ చేపట్టిన ఈ ప్రాజెక్టు తిరిగి జింపింగ్‌కు పెను సవాళ్లు విసురుతోంది.

వన్ బెల్డ్ వన్ రోడ్.. ప్రపంచ వాణిజ్యాన్నంతటినీ తన గుప్పిటలోకి తెచ్చుకోవడానికి.. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వేసిన స్కెచ్. పేద దేశాల అవసరాలను తీర్చుతామంటూ ఆశ చూపి.. తన వ్యాపార విస్తరణకు వేసిన.. వేస్తున్న రోడ్ అది. రెండు వేల ఏళ్ల క్రితం నాటి సిల్క్రోడ్‌ను పునరుద్దరిస్తామంటూ మొదలైన ఈ ప్రాజెక్టుకు.. కరోనా కారణంగా భారీ సవాళ్లు ఎదురవుతున్నాయి. బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ కష్టాల్లో పడింది. కరోనా కారణంగా దాదాపు 70శాతం పనులు ఆగిపోయాయి.

చైనా అధికారుల అంచనా ప్రకారం.. ప్రాజెక్టుకు తగిలిన మొదటి దెబ్బ. నమలగలిగిన దానికాన్నా ఎక్కువే జింపింగ్ నోట్లో వేసుకున్నారని చైనాలో వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా దేశాల్లో వర్తకానికి, పెట్టుబడులకు అవకాశం కల్పించే ఈ ప్రాజెక్టు ..ప్రపంచంపై చైనా ప్రభావాన్ని పెద్ద ఎత్తున పెంచనుంది. తాను అధికార పగ్గాలు చేపట్టాక 2013లో జిన్పింగ్ ఈ ప్రాజెక్టు చేపట్టారు. ఆగ్నేయ ఆసియా, మధ్య ఆసియా, గల్ఫ్ ప్రాంతాల్ని .. ఆఫ్రికా, ఐరోపా దేశాలను రైలు, రోడ్డు ప్రాజెక్టుల ద్వారా కలుపుతుంది. ఇందులో భాగంగా చైనా, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టు చేపట్టారు.

ఇది చైనాలోని షిన్ జియాంగ్ ప్రాంతాన్ని పాకిస్తాన్‌లోని గ్వదర్ పోర్టుతో కలుపుతుంది. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ లో గ్వదర్ పోర్టును చైనా నిర్మిస్తోంది. కరోనా కారణంగా ఏర్పడ్డ పరిస్థితిని సమీక్షించడానికి గతవారం చైనా మొట్టమొదటిసారిగా దీనిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని చైనా విదేశాంగ మంత్రి వాన్గ్ యి సభ్య దేశాలను కోరారు. కరోనా కారణంగా దెబ్బతిన్న ఆర్ధిక పరిస్థితి తిరిగి మెరుగు పడాలంటే ఇదెంతో ముఖ్యమన్నారు. చైనా, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పనులతో సహా అనేక దేశాల్లో బి‌ఆర్‌ఐ ప్రాజెక్టు పనులు కుంటి నడకన సాగుతున్నాయి. చైనా, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా వెళుతున్నందు వల్ల దీనికి మన దేశం అభ్యంతరం తెలిపింది.

అనేక ఆసియా దేశాల్లో ఇటీవల ఈ ప్రాజెక్టుపై పునరాలోచన మొదలయ్యింది. కొద్ది మాసాల క్రితం మలేసియా, బాంగ్లాదేశ్, ఇండోనేషియా, పాకిస్తాన్, కంబోడియా, శ్రీలంక దేశాలు ఈ ప్రాజెక్టు పనులకు బ్రేకులు వేశాయి. కరోనా కారణంగా కంబోడియా లోని సిహానౌక్ విల్లే స్పెషల్ ఎకనామిక్ జోన్ ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి. ఇండోనేషియా లోని జకార్తా – బాండుంగ్ హై స్పీడ్ రైల్ పనులకు కూడా ఇదే గతి పట్టింది. నైజీరియాలోని 150 కోట్ల డాలర్ల రైలు ప్రాజెక్టు కరోనా వల్ల ఆగిపోయింది. జాంబియా, జింబాబ్వే , ఈజిప్టు దేశాల్లోని ప్రాజెక్టులు కూడా కుంటి నడక నడుస్తున్నాయి. బి‌ఆర్‌ఐలోని ప్రాజెక్టుల్లో కొన్ని ఆగిపోయాయి. మరికొన్ని నత్త నడకగా సాగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నాటికల్లా వివిధ దేశాల్లో దీని కింద 2,951 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి.ఈ ప్రాజెక్టుల మొత్తం విలువ దాదాపు నాలుగు ట్రిలియన్ డాలర్లు. ఆసియా, ఆఫ్రికాలో అనేక దేశాలు ఈ ప్రాజెక్టు కోసం చైనా ఇచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక గిలగిల్లాడుతున్నాయి.

చైనా ఎక్సిమ్ బ్యాంకు, చైనా డెవలప్మెంట్ బ్యాంకు ఈ ప్రాజెక్టు కోసం అత్యధికంగా రుణాలిచ్చాయి. మారిన పరిస్థితుల్లో కొత్త రుణాలు ఇవ్వడానికి జంకుతున్నాయి. కరోనా కన్నా ముందే ఈ బ్యాంకులు రుణాలిచ్చే విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. బి‌ఆర్‌ఐ ప్రాజెక్టుపై చైనా అధ్యక్షుడు జింపింగ్ రెండు వైపుల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కుంటున్నారు. ఒక పక్క పేద దేశాలు తమ రుణాలపై వడ్డీ మాఫీ చేయాలని డిమాండు చేస్తున్నాయి. మరో పక్క చైనాలో ఈ విషయంపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలయ్యింది. లక్షల కోట్ల డాలర్లు తీసుకెళ్లి విదేశాల్లో పోస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. కరోనా కారణంగా దెబ్బ తిన్న ఆర్ధిక పరిస్థితిని ముందు చక్క దిద్దాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్లు చక్కర్లు కొడుతున్నాయి.

Related Posts