లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

అమెరికా అధ్యక్షుడి ప్రమాణం ఎలా జరిగింది..విశేషాలు!

Updated On - 6:58 am, Thu, 21 January 21

swearing America President : అమెరికాలో అధికార మార్పిడి సజావుగా సాగిపోయింది. అగ్రరాజ్యం 46వ అధ్యక్షుడిగా జో బైడెన్.. 46వ ఉపాధ్యాక్షురాలిగా కమలా హారీస్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రపంచానికే పెద్దన్నలాంటి అమెరికాలో అధ్యక్షుని ప్రమాణస్వీకారం ఎలా జరిగింది? భద్రత బలగాల పటిష్ట పహారా మధ్య అమెరికా 46వ అధ్యక్షుడిగా జోసెఫ్‌ రాబినెట్‌ బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. క్యాపిటల్‌ భవనంలో సంప్రదాయంగా ప్రమాణ స్వీకారం జరిగే ప్రదేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌.. బైడెన్‌తో దేశ నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేయించారు. తమ కుటుంబానికి చెందిన 127 ఏళ్లనాటి బైబిల్‌పై ప్రమాణం చేసి బైడెన్‌ దేశాధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. గతంలో సెనేటర్‌గా, ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా ఆయన ఈ బైబిల్‌పైనే ప్రమాణం చేశారు.

కమలా ప్రమాణ స్వీకారం : –
అధ్యక్షుడుగా బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు, దేశ 49వ ఉపాధ్యక్షురాలిగా తమిళనాడు మూలాలున్న ఇండో-ఆఫ్రో అమెరికన్‌ మహిళ కమల హ్యారిస్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో సుప్రీంకోర్టు న్యాయమూర్తి సోనియా సోటోమేయర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారమహోత్సవంలో.. మొదట సెనేటర్‌ అమీ క్లాబుకర్‌ ప్రారంభోపన్యాసం చేశారు. మరో సెనెటర్‌ రాయ్‌బ్లంట్‌ ప్రారంభ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తి : –
బైడెన్‌ కుటుంబానికి సన్నిహితుడైన రోమన్‌ కాథలిక్‌ మత ప్రబోధకుడు లియో జెరెమి ఓ డోనోవాన్‌ ప్రార్థనలు చేశారు. ప్రార్ధనలు ముగిసిన తర్వాత లేడీ గాగా అమెరికా జాతీయ గీతాన్ని ఆలపించారు. జార్జియాలోని సౌత్‌ ఫల్టన్‌లో ఫైర్‌ రెస్క్యూ డిపార్ట్‌మెంట్‌కు కెప్టెన్‌గా ఎంపికైన తొలి ఆఫ్రో అమెరికన్‌ మహిళ ఆండ్రియా హాల్‌ ప్రతిజ్ఞ చేశారు. ఆ తరువాత, కమల హ్యారిస్‌తో సుప్రీంకోర్టు న్యాయమూర్తి సోనియా సోటోమేయర్‌ ప్రమాణం చేయించారు. ప్రమాణస్వీకారం చేయగానే కమల హ్యారీస్‌ భర్తను కౌగిలించుకుని ఆనందబాష్పాలు కార్చారు. ఆ తర్వాత నటి, గాయని జెన్నిఫర్‌ లోపెజ్‌ పాట పాడి ఊర్రూతలూగించారు.

బైడెన్ ప్రమాణం : –
దేశాధ్యక్షుడిగా జో బైడెన్‌తో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం.. బైడెన్‌ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సుమారు 21 నిమిషాల పాటు ఆయన ప్రసంగం సాగింది. ప్రమాణ స్వీకార చేసేప్పుడు ఆయన భార్య జిల్ బిడెన్ పక్కనే ఉన్నారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే ఆమె భర్త పెదాలపై ముద్దు పెట్టారు. లిప్‌లాక్‌తో గ్రీటింగ్స్ తెలిపారు.

తొలి ట్వీట్ : –
ఆ వెంటనే జో బిడెన్ ట్విట్టర్ హ్యాండిల్ మారిపోయింది. ప్రెసిడెంట్ బిడెన్ అనే పేరుతో పోటుస్ ట్విట్టర్ హ్యాండిల్‌ను వినియోగంలోకి తీసుకొచ్చారు. అప్పటికప్పుడు తొలి ట్వీట్‌ను పోస్ట్ చేశారు. వృధా చేయడానికి ఒక్క నిమిషం కూడా తమ వద్ద అదనంగా లేదని పేర్కొన్నారు. అధ్యక్షుని ప్రసంగం తర్వాత.. 2017లో తొలి యువ కవయిత్రి పురస్కారాన్ని పొందిన అమండా గార్మన్‌.. తాను రాసిన ఒక కవితను చదివి వినిపించారు. డెలావర్‌లోని విల్మింగ్టన్‌లో ఉన్న బెతెల్‌ ఆఫ్రికన్‌ మెథడిస్ట్‌ ఎపిస్కోపల్‌ చర్చ్‌ పాస్టర్‌ సిల్విస్టర్‌ బీమన్‌ ఆశీస్సులు అందజేశారు.

భారీ భద్రత : –
మరోవైపు.. అధ్యక్ష పదవిని వీడుతున్న డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతుదారులు అల్లర్లకు, దాడులకు పాల్పడే అవకాశముందన్న హెచ్చరికలతో.. క్యాపిటల్‌ భవనంలో, ప్రమాణ స్వీకార ప్రదేశంలో అసాధారణ స్థాయిలో బలగాలను మోహరించారు. నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పదవి నుంచి వైదొలగుతున్న అధ్యక్షడు పాల్గొనడం ఆనవాయితీ. కానీ, ఆ సంప్రదాయాన్ని తోసిపుచ్చుతూ, బైడెన్‌ ప్రమాణ స్వీకారానికి ట్రంప్‌ హాజరు కాలేదు. ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. అలాగే, కోవిడ్‌19 నిబంధనలతో అసాధారణంగా, ఎంపిక చేసిన కొందరు ఆహూతుల సమక్షంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ అధ్యక్షులు ఒబామా, జార్జ్‌ బుష్, క్లింటన్‌ తమ సతీమణులతో కలిసి హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన సుమారు వెయ్యి మందిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కాంగ్రెస్‌ సభ్యులు కూడా ఉన్నారు.