Home » వైసీపీకి సూటి ప్రశ్న: వ్యవస్ధపై నమ్మకం లేకపోతే ఏపీలో ఎలా పోటీ చేస్తున్నారు
Published
2 years agoon
By
chvmurthyచిత్తూరు: ఏపీ పోలీసులపై నమ్మకం లేకపోతే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఎందుకు పోటీ చేస్తోందని సీఎం చంద్రబాబు,వైసీపీ అధినేత జగన్ ను ప్రశ్నించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తన స్వగ్రామం నారావారిపల్లెకు వచ్చిన ఆయన మంగళవారం సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ..ఏపీలో ఉంటూ, ఏపీలోరాజకీయ పార్టీ నడుపుతూ, ఏపీలో పోలీసు వ్యవస్ధమీద నమ్మకంలేదనటం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. ఏపీపై దుష్ప్రచారం చేస్తూ పక్క రాష్ట్రంలో కేసులు పెడుతున్నారని ఆయన విమర్శించారు. విశాఖపట్నంలో ఘటన జరిగితే ఏపీ పోలీసులపై నమ్మకం లేకుండా NIA విచారణ కోరటం ఎంతవరకు న్యాయమని చంద్రబాబు అన్నారు. జగన్ సోదరి షర్మిల టీడీపీపై చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. టీడీపీ ఎప్పుడూ మహిళల పట్ల గౌరవంగానే ఉంటుందని ఆయన తెలిపారు. టీడీపీ నైతిక విలువలు కలిగిన పార్టీ అని, షర్మిల వ్యాఖ్యలతో నాకు గానీ, మా పార్టీకి గానీ ఏమి సంబంధం లేదని అన్నారు. ఏపీలో మళ్లీ టీడీపీ వస్తేనే ఏపీ అభివృధ్ది జరుగుతుందని,సంక్షేమ పధకాలు అమలవుతాయని ప్రజలు అనుకుంటున్నారని జనం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. తెలంగాణలో జరగని అభివృధ్ది ఏపీలో చేశామని, వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఏకపక్షంగా విజయం సాధించబోతోందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.