ముగ్గురు ముఖ్యమంత్రుల కేబినెట్‌లో పని చేసిన ఆమెకు, టీఆర్ఎస్‌లో ఎదిగే అవకాశం ఎంత?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సునీతా లక్ష్మారెడ్డి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్లూ మంత్రిగా పనిచేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల కేబినెట్లలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఆమెది. గత ఎన్నికల్లో నర్సాపూర్ టీఆర్ఎస్ అభ్యర్థి చిలుముల మదన్‌రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. అప్పటికీ ఆమె డీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే నియోజకవర్గంలో తనకు భవిష్యత్ ఉండదని భావించిన సునీత ఓటమి తర్వాత కొన్నాళ్లకు ప్రగతి భవన్‌లో కేటీఆర్‌ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

టికెట్ కోసం పోటాపోటీ:
ప్రస్తుత ఎమ్మెల్యే మదన్‌రెడ్డి వరుసగా రెండోసారి గెలిచారు. గత ఎన్నికల్లో మదన్‌రెడ్డితో పాటు ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్ కూడా అసెంబ్లీ సీటు ఆశించి భంగపడ్డారు. ఇక వచ్చే ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని అనుకున్న మురళీ యాదవ్‌కు సునీతా లక్ష్మారెడ్డి చేరిక తన ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో దాదాపుగా సునీతకే సీటు ఖరారవుతుందన్న భరోసాతో ఆమెను నమ్ముకుని వచ్చిన కేడర్ పని చేస్తోంది. వాస్తవంగా గత ఎన్నికల్లోనే మదన్‌రెడ్డికి బదులు వేరే ఎవరికైనా ఇవ్వాలన్న ఆలోచన నామినేషన్ల చివరి తేదీ వరకు కొనసాగింది. వయోభారంతో ఉన్నా ఈసారి కూడా ఆయనకే ఇవ్వాలన్న తుది నిర్ణయంతో రెండోసారి మదన్‌రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు.

ఉద్యమ సమయంలో పని చేసిన పార్టీ కేడర్‌ కంటే సునీత వర్గానికే ఎక్కవ ప్రాధాన్యం:
సునీతా లక్ష్మారెడ్డి చేరికతో దాదాపుగా మురళీయాదవ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల రేసులో లేనట్లే అని జరుగుతున్న పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఎన్నికల తర్వాత టీఆర్ఎస్‌లో చేరిన సునీతను కొన్నాళ్లు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి దూరం పెట్టారు. కాకపోతే డైరెక్టుగా కేటీఆర్ జోక్యం చేసుకొని ఆమెను కార్యక్రమాల్లో కలుపుకొని వెళ్లాలని మదన్‌కు చెప్పడంతో ఇప్పుడు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కలసి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఉద్యమ సమయంలో పని చేసిన పార్టీ కేడర్‌ కంటే సునీత వర్గానికే ఎక్కవ ప్రాధాన్యం ఇస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.

వచ్చే ఎన్నికల వరకు ఇలాగే ఉంటారా?
మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా పనిచేశారు. ఆయన సతీమణి రాజమణి ఉమ్మడి మెదక్ జడ్పీ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. ఇప్పుడు వీరందరి కంటే కూడా సునీత లక్ష్మారెడ్డికి, ఆమె వర్గానికే పార్టీ ప్రాధాన్యం ఇవ్వడంపై కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. మదన్‌రెడ్డికి బదులు వేరొకరు అన్నప్పుడు కచ్చితంగా మురళీయాదవ్‌కే ఆ అవకాశం ఉండేది. కానీ, మురళీ యాదవ్ పార్టీని అడ్డం పెట్టుకుని చేసిన కొన్ని పనుల వల్లే ఆయనపై పార్టీ అధిష్టానానికి సదాభిప్రాయం లేకుండాపోయిందని అంటున్నారు. ఏదేమైనా సునీతా లక్ష్మారెడ్డి పార్టీలో చేరినప్పటి నుంచి పార్టీ అధిష్టానం ఆదేశాలకనుగుణంగా పని చేసుకుంటూ పోతున్నారు. అటు మదన్ రెడ్డి, ఇటు సునీతా లక్ష్మారెడ్డి, మరోవైపు మురళీయాదవ్ ఎవరికి వారు విభేదాలు పైకి కన్పించకుండా సాగుతున్నారు. వచ్చే ఎన్నికల వరకు ఇలాగే ఉంటారా? లేదా వర్గ విభేదాలతో బయటపడతారా వేచి చూడాలి.

READ  వెంకన్న దివ్య దర్శనానికి.. జగన్ సర్వదర్శనం టోకెన్

Related Posts