ఫేక్ కాల్స్‌తో జాగ్రత్త.. కనిపెట్టడం ఎలా? మనల్ని మనం రక్షించుకోవడం ఎలా?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

fake calls: టెక్నాలజీతో ప్రపంచాన్ని అరచేతిలో చూస్తున్న రోజులివి.. ఇది సంతోషించాల్సిన విషయమే. కానీ, పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచి కంటే చెడుకే ఎక్కువగా ఉపయోగిస్తుండటం ఆందోళనకు గురి చేస్తోంది. మొబైల్ ఫోన్స్ లో వస్తున్న కొత్త కొత్త యాప్స్ క్రిమినల్స్ కు ఆయుధంలా మారుతున్నాయి. యాప్స్ ద్వారా ఫేక్ కాల్స్‌తో నేరాలకు పాల్పడుతున్నారు. ఇంతకీ ఈ ఫేక్ కాల్స్‌ని కనిపెట్టేది ఎలా? ఇలాంటి నేరాలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

టెక్నాలజీతో అసాంఘిక కార్యకలాపాలు, నేరాలు:
ఒక ఐడియా జీవితాన్ని మారుస్తోంది. కానీ ఒక మొబైల్ ఫోన్ మాత్రం జీవితాన్ని సర్వ నాశనం చేస్తుంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ తెలంగాణలోని మహబూబాబాద్ సంఘటన. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అదునుగా చేసుకుని దారుణాలకు ఒడిగడుతున్నారు. చివరికి కటకటాల్లోకి వెళ్తున్నారు. ఒక మొబైల్ తో ప్రపంచాన్ని చూసి ఎంతో పరిజ్ఞానం పొందవచ్చు. అలాగే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడొచ్చు. ఈ విషయం బాలుడు దీక్షిత్ రెడ్డి కేసులో రుజువైంది. కిడ్నాపర్ ఫేక్ యాప్‌తో బ్లాక్ మెయిల్ చేసిన తీరు అందరినీ విస్మయానికి గురిచేసింది. ఈ కేసుతో పోలీసులకు టెక్నికల్‌గా పెద్ద సవాల్‌ ఎదురైందనే చెప్పాలి.

ఉగ్రవాదులు, గూఢచారులు ఉపయోగించే యాప్స్‌:
బాలుడు కిడ్నాప్, హత్య ఇదంతా టెక్నాలజీ సాయంతో చేయడం పోలీసులకు కొంత సవాలుగా మారింది. అసలు కాల్ ఎక్కడి నుండి వస్తుంది. ఎవరు చేస్తున్నారో తెలుసుకోవడానికి నాలుగు రోజుల సమయం పట్టింది. చివరికి నిందితున్ని పట్టుకున్నా బాలుడి కథ మాత్రం విషాదాంతంగా ముగిసింది. సాధారణంగా ఉగ్రవాదులు, గూడఛారులు తమ జాడ తెలియకుండా ఇలాంటి యాప్స్‌ ద్వారా సంప్రదింపులు జరిపి నేరాలకు పాల్పడుతుంటారని క్రైం బ్రాంచ్ పోలీసులు చెబుతున్నారు.

ఇంటర్నేషనల్ కాల్స్‌ పట్టుకోవడం అసాధ్యమే, యాప్ యాజమాన్యం నుంచి ఆలస్యంగా సమాచారం:
సాధారణంగా మనం చేసే‌ కాల్స్‌ అవతలి వ్యక్తికి చేరే లోపల పలు టవర్లు, టెలిఫోన్‌ ఎక్సేంజ్‌ల మధ్య కనెక్టివిటి ఏర్పడుతుంది. ఈ కాల్స్ ద్వారా నేరాలకు పాల్పడితే వెంటనే పోలీసులు అప్రమత్తమై ఐపి అడ్రస్ ద్వారా టవర్ లోకేషన్ ట్రెస్ చేసి నిందితున్ని పట్టుకుంటారు. కానీ ఈ యాప్స్ ద్వారా చేస్తున్న ఇంటర్నేషనల్ కాల్స్‌ను పట్టుకోవడం మాత్రం అసాధ్యమైన పని అని పోలీసులు అంటున్నారు. ఆ కాల్స్ ఏ యాప్ ద్వారా వస్తుందో తెలుసుకుని ఆ యాజమాన్యానికి సమాచారం అందించి పూర్తి వివరాలు వచ్చేవరకు చాలా సమయం పడుతుందంటున్నారు. మానుకోట ఘటనలో కూడా ఇదే పరిస్థితి తలెత్తిందన్నారు.

ఇంటర్నేషనల్ కాల్స్‌తో జాగ్రత్త:
ఇలాంటి ఫేక్ యాప్స్‌తో నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని వీటిని నియంత్రించేలా గూగుల్ సంస్థకు లేఖ రాస్తామంటున్నారు పోలీసులు. ప్రజలు కూడా ఇంటర్నేషనల్ కాల్స్‌ను దూరంగా పెట్టడం మంచిందటున్నారు. నేరగాళ్లు ఎక్కువగా ఫేక్ కాల్స్ తో జాబ్ ఆఫర్స్, బ్యాంక్ ఫ్రాడ్స్, ఆన్ లైన్ గిఫ్ట్స్ అంటూ మోసాలు చేస్తున్నారన్నారు. ఇలాంటి కాల్స్‌ను గుర్తించేందుకు కొంత టెక్నాలజీ అవసరమని చెప్పారు.

మన దేశం నుంచి టిక్‌ టాక్‌, పబ్జీ తరహాలో ఫేక్ యాప్స్‌ను కూడా బ్యాన్‌ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దేశ భద్రతకు పెనుసవాలు విసిరే ఈ తరహా యాప్స్ ను కట్టడి చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని స్పష్టం చేస్తున్నారు.

Related Tags :

Related Posts :