భార్య తల నరికి బలి ఇచ్చిన భర్త, దైవం కరుణించి సిరిసంపదలు ఇస్తుందని

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఆధునిక యుగంలోనూ కొందరు మూఢ నమ్మకాలను విశ్వసిస్తున్నారు. మూఢ విశ్వాసంతో దారుణాలకు ఒడిగడుతున్నారు. పక్కవారి ప్రాణాలు తీస్తున్నారు. మూఢ నమ్మకంతో ఓ వ్యక్తి అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. దైవాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఏకంగా తన భార్యనే బలి ఇచ్చాడు. తన పిల్లల ముందే భార్య తల నరికి దైవానికి బలి ఇచ్చాడు. ఆ తర్వాత శవాన్ని పూజ గదిలో పాతిపెట్టాడు. ఈ దారుణం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.

నరబలి ఇస్తే దైవం కరుణిస్తుందని:
ఈ కిరాతకంపై మృతురాలి ఇద్దరు కొడుకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రోలీలో 50 ఏళ్ల వయస్సు గల వ్యక్తి దేవతకు బలులు ఇస్తే సిరి సంపదలు కలుగుతాయని విశ్వసిస్తూ వచ్చాడు. దాంతో తొలుత ఓ మేకను బలి ఇచ్చి, దాన్ని పూజ గదిలో పాతిపెట్టాడు. ఆ తర్వాత నరబలి ఇస్తే దైవం కరుణిస్తుందని నమ్మాడు. దీంతో తన భార్యనే(45) బలి ఇచ్చాడు. ఆమె శవాన్ని కూడా పూజ గదిలో పెట్టాడు.

పూజ గదిలో శవాన్ని పాతి పెట్టాడు:
బ్రజేష్ కేవాత్ తన ఇద్దరు పిల్లలు మనోజ్, సురేంద్ర ముందే భార్యను బలి ఇచ్చాడు. ఆమె తలను, మొండేన్ని వేరు చేసి పూజ గదిలో పూడ్చి పెట్టాడు. ఆ తర్వాత అతను పారిపోవడానికి ప్రయత్నించాడు. భార్యను అర్థరాత్రి చంపుతుండగా ఇద్దరు పిల్లలు లేచారు. తండ్రి ఘాతుకాన్ని కళ్లారా చూసి భయాందోళన చెందారు. ఆ తండ్రి వారిని కూడా బెదిరించాడు. పిల్లలు పారిపోయి ఆ విషయాన్ని స్థానికులకు చెప్పారు. వారి ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు.

రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని వెలికితీశారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దైవం కరుణించాలంటే నరబలి ఇవ్వాలనే మూఢ నమ్మకంతో ఆ వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు చెప్పారు.

Related Posts