హృదయవిదారకం, భార్య మరణం తట్టుకోలేక భర్త ఆత్మహత్య, అనాథగా మారిన 8 రోజుల శిశువు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. అన్యోన్యంగా జీవిస్తున్నారు. వారి ప్రేమకు, దాంపత్య జీవితానికి ప్రతిరూపంగా ఒక బిడ్డ కూడా పుట్టాడు. అంతా సవ్యంగా సాగిపోతోంది. కానీ విధి కన్ను కుట్టిందో మరో కారణమో కానీ, పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన రెండు రోజుల్లోనే ఆమె ఈ లోకాన్ని వీడింది. తనకు తోడునీడగా ఉంటుందనుకున్న భార్య అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆ భర్త తట్టుకోలేకపోయాడు. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. అలా అతడు కూడా ఈ లోకాన్ని వీడాడు. చివరికి 8 రోజుల పసికందు తల్లిదండ్రులు లేని అనాథగా మిగిలిపోయాడు.

ఫిట్స్ రావడంతో భార్య మృతి:
హృదయ విదారకరమైన ఈ ఘటన విశాఖలోని సింహాచలం కొండపై సింహగిరి గిరిజన గ్రామంలో చోటుచేసుకుంది. గిరిజన గ్రామంలో ఎదురెదురు ఇళ్లళ్లో ఉంటున్న జలుమూరి శ్రావణ్‌కుమార్, అంబిక ప్రేమించుకున్నారు. ఏడాది క్రితం వివాహం చేసుకున్నారు. అంబిక గర్భం దాల్చింది. కాగా, వివాహానికి ముందు నుంచే అంబిక ఫిట్స్ తో బాధ పడుతోంది. జూలై 6న ఫిట్స్‌ రావడంతో 9 నెలల గర్భిణి అయిన అంబికను నగరంలోని కేజీహెచ్‌కి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకి శస్త్రచికిత్స చేయగా పండంటి మగబిడ్డని ప్రసవించింది. ప్రసవ సమయంలో కూడా తీవ్రంగా ఫిట్స్‌ వచ్చాయి. దీంతో రెండు రోజుల తర్వాత అంటే జూలై 8న ఆమె మృతి చెందింది.

భార్య మరణంతో భర్త మనస్తాపం:
భార్య మృతిని భర్త తట్టుకోలేకపోయాడు. గుండె పగిలేలా ఏడ్చాడు. ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న భార్య ఇక లేదనే వార్తను అతడు జీర్ణించుకోలేకపోయాడు. రోజూ ఆమెని తలుచుకుని విలపించే వాడు. నువ్వు లేక నేను లేను అంటూ అతడు తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. తన భార్య దగ్గరికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న శ్రావణ్, ఆదివారం(జూలై 12,2020) సాయంత్రం ఇంటికి సమీపంలోనే చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అటు తల్లి, ఇటు తండ్రి ఇద్దరూ దూరం కావడంతో 8 రోజుల శిశువు అనాథ అయ్యాడు. ఎంతో అన్యోన్యంగా ఉండే అంబిక, శ్రావణ్ కుమార్ మరణించడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఒకరి మీద మరొకరికి ఉన్న వారి ప్రేమను తలుచుకుని కన్నీటి పర్యంతం అయ్యారు.

ఈ రోజుల్లోనూ ఇలాంటి భర్తలు ఉంటారా:
ఈ రోజుల్లో అదనపు కట్నం కోసమో, అందంగా లేదనో, అక్రమ సంబంధాల మోజులోనూ భార్యలను భర్తలు, భర్తలను భార్యలను రాచిరంపాన పెట్టే వారు ఎందరో ఉన్నారు. పెళ్లైన కొన్ని రోజులకే భర్త, అత్తింటి వేధింపులు తాళలేక నవ వధువులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఉన్నాయి. అలాంటి ఈ రోజుల్లో, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్య ఇక లేదనే మనస్తాపంతో శ్రావణ్ ఆత్మహత్య చేసుకోవడం అందరిని కలిచి వేస్తోంది. భార్య మీద అతడికున్న ప్రేమకు నిదర్శనంగా నిలిచింది. పైగా శ్రావణ్, అంబికలది చిన్న వయసే. ఏడాది క్రితమే పెళ్లయింది. ఇంతలోనే ఇద్దరూ శాశ్వతంగా ఈ లోకం నుంచి వెళ్లిపోవడం అందరిని బాధించింది. కాగా, శ్రావణ్ తన కొడుకు గురించి ఆలోచన చేసి ఉండాల్సిందని, తొందరపడకుండా ఉండాల్సిందని కొందరు వాపోయారు. ఆ శిశువు అనాథగా మారడంతో అయ్యో పాపం అని అంతా జాలి చూపుతున్నారు.

READ  ఎంఎస్ఎమ్ఈలపై ఏపీ గవర్నమెంట్ ఫోకస్.. రీ స్టార్టింగ్‌కు భారీ బడ్జెట్ కేటాయింపు

Related Posts