హైదరాబాద్ సిటీ బస్సులకు ఆదరణ కరువు.. ప్రజలు ఆర్టీసీ బస్సులు ఎందుకు ఎక్కడం లేదు? కారణాలు ఏంటి?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

hyderabad city bus: హైదరాబాద్‌లో వారం రోజుల కిందటే సిటీ బస్సులు రోడ్డెక్కాయి. ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత రాజధాని రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. వారం రోజులుగా నగర వ్యాప్తంగా 25శాతం బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. మరి ఆర్టీసీ ఆశించినట్టుగా సిటీ బస్సులకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తోందా? భాగ్య నగరంలో మరిన్ని బస్సులు పెంచాలా? లేక ఉన్నవాటినే కంటిన్యూ చేయాలా? దీనిపై సర్కార్‌ ఏ నిర్ణయం తీసుకోబోతోందన్నది త్వరలో తేలే అవకాశముంది.

6నెలల సుదీర్ఘ విరామం తర్వాత రోడ్డెక్కిన బస్సులు:
హైదరాబాద్‌ మహానగరంలో సిటీ బస్సులు సరిగ్గా వారం కిందట రోడ్డెక్కాయి. గత శుక్రవారం నుంచి రాజధానిలో ప్రగతి రథ చక్రాలు పరుగుపెడుతున్నాయి. ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత సిటీ బస్సులకు ప్రభుత్వం అనుమతించడంతో.. ఆర్టీసీ అధికారులు బస్సులు నడుపుతున్నారు. ఒకేసారి అన్ని సర్వీసులను నడపకుండా దశల వారీగా నడపాలని నిర్ణయించారు. దీంతో తొలి దశలో 25శాతం బస్సులు రోడ్డెక్కాయి. ప్రజల ఆదరణనుబట్టి మరిన్ని బస్సులు నడపాలని ఆర్టీసీ భావించింది.

హైదరాబాద్‌ నగరంలో 29 బస్సు డిపోలు ఉన్నాయి. వీటిలో 3వేల 500లకుపైగా బస్సులు ఉన్నాయి. ఇందులో వెయ్యికిపైగా బస్సులు కాలం చెల్లినవి. మిగిలిన 2వేల 500 బస్సుల్లో.. తొలి దశలో 600 బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. ఈ బస్సులు ప్రధానమైన 39 రూట్లలో తిప్పుతున్నారు.

అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి:
అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి అన్నట్టుగా తయారైంది సిటీ బస్సుల పరిస్థితి. ప్రజల నుంచి ఎంతో ఆదరణ ఉంటుందని ఆర్టీసీ అధికారులు భావించారు. కానీ వారు ఊహించిన దానికి పరిస్థితి భిన్నంగా తయారయ్యింది. ప్లాన్‌ అంతా రివర్స్‌ అయింది. నగర ప్రజల నుంచి ఆదరణ అంతంత మాత్రమే లభిస్తోంది. బస్సులను శానిటైజ్‌ చేసి, భౌతికదూరం పాటిస్తూ తిప్పుతున్నా.. ప్రజలు మాత్రం ఇంకా ఆర్టీసీ బస్సులను ఎక్కడం లేదు. కోవిడ్‌ భయం కారణంగా.. సిటీ బస్సుల్లో పెద్దగా ప్రయాణించడం లేదు. 25శాతం బస్సులనే ఆర్టీసీ తిప్పుతున్నా… వాటికి కూడా ఆదరణ పెద్దగా లేదనే చెప్పాలి. ఒక్కో బస్సులో పదిమందిలోపే ప్రయాణం చేస్తున్నారు.

ఇంకా తొలగని కరోనా భయం:
నగరవాసులు సిటీ బస్సుల్లో ప్రయాణం చేయకపోవడానికి కారణాలు కూడా ఉన్నాయి. ప్రజల్లో ఇంకా కరోనా భయం తొలగిపోలేదు. అంతేకాదు.. లాక్‌డౌన్‌, ఆ తర్వాత కాలంలో ప్రజలంతా సొంత వాహనాలకు అలవాటుపడిపోయారు. వాహనాలు లేని వారు కొత్త వాటిని కనుగోలు చేసి మరీ తమ పనులు చేసుకుంటున్నారు. దీంతో ఎక్కడికైనా తమ సొంత వాహనాల్లోనే వెళ్తూ పనులు చక్కబెట్టుకుంటున్నారు.

బస్సులు తిరిగే రూట్లు, టైమ్ పై ప్రచారం లేకపోవడం:
ఇంకా పూర్తి స్థాయిలో ప్రైవేట్‌ సంస్థలు ఓపెన్‌ కాకపోవడం, పారిశ్రామిక వాడల్లోని కంపెనీలు ప్రారంభం కాకపోవడం కూడా కారణంగా తెలుస్తోంది. బస్సులు తిరిగే రూట్లు, టైమ్‌పై పెద్దగా ప్రచారం కాలేదు. ఇది కూడా నగర వాసులు బస్సుల్లో ప్రయాణించకపోవడానికి మరో కారణంగా భావించవచ్చు. బస్సు పాస్‌లు తీసుకున్న వారి…. పాస్‌ రెన్యూవల్‌కు సంబంధించి ఆర్టీసీ అధికారులు స్పష్టత ఇవ్వలేదు. ఇవన్నీ ప్రజలు సిటీ బస్సులను ఆశ్రయించకపోవడానికి కారణాలుగా తెలుస్తోంది.

ఆక్యుపెన్సీ 30శాతం కూడా మించడం లేదు:
ప్రస్తుతం హైదరాబాద్‌లో సిటీ బస్సులతోపాటు మొత్తం సబర్బన్‌, ముసిఫిల్‌ సర్వీసులు కలిపి 1600 నడుస్తున్నాయి. ప్రజల నుంచి వీటికి పెద్దగా ఆదరణ కనిపించకపోవడంతో… ప్రతిరోజు ఆక్యుపెన్సీ కేవలం 30శాతం కూడా మించడం లేదు. ప్రయాణికులు లేకుండా బస్సులు నడపడం ఆర్టీసీ సంస్థకు ఆర్థికంగా ఇబ్బందే. ఆదాయం కోసమే కాకుండా ప్రజలకు సేవ చేయాలనే కోణంలోనే బస్సులు నడిపిస్తునప్పటికీ…. ప్రయాణికుల నుంచి మాత్రం సరైన ఆదరణ లభించడం లేదు. దీంతో ఆర్టీసీ అధికారులు సందిగ్దంలో పడిపోయారు. సిటీలో బస్సు సర్వీసులను పెంచాలా.. తగ్గించాలా.. లేక 25శాతం బస్సులనే కంటిన్యూ చేయాలా అన్నది తెలియక తలలు పట్టుకుంటున్నారు.

ఆర్టీసీకి మరిన్ని నష్టాలు:
ప్రయాణికులు లేకుండా బస్సులు నడపడం సంస్థను మరింత నష్టాల్లోకి నెట్టనుంది. దీంతో గ్రేటర్‌ ఆర్టీసీ అధికారులు… పరిస్థితిని అంచనా వేస్తున్నారు. మూడు నాలుగు రోజుల తర్వాత సర్వీసులు పెంచాలా.. తగ్గించాలా అన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈలోగా ప్రయాణికుల నుంచి ఆదరణ పెరిగితే బస్సులు పెంచే అవకాశముంది. లేకుంటే ఏం చేయాలన్నది సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు.
Related Posts