హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్, త్వరలో రోడ్డెక్కనున్న సిటీ బస్సులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అంతరాష్ట్ర బస్ సర్వీసుల విషయంలో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య పేచీ కొనసాగుతోంది. దానిపై ఇప్పట్లో క్లారిటీ వచ్చేలా కనిపించడం లేదు. మరి.. హైదరాబాద్‌లో సిటీ బస్సులు ఎప్పటి నుంచి తిరుగుతాయ్. ఈ క్వశ్చన్‌కి మాత్రం ఆర్టీసీ అధికారుల నుంచి స్పష్టత రావడం లేదు. దీంతో.. తెలంగాణ ఆర్టీసికి మరింత నష్టం వాటిల్లనుంది. సిటీ పబ్లిక్ కూడా ఇప్పటికే చాలా ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు. ఐతే.. త్వరలోనే సిటీ బస్సులను రోడ్డెక్కించేందుకు.. ఆర్టీసి అధికారులు కసరత్తు చేస్తున్నారు.

త్వరలో సిటీ బస్సు సర్వీసులు:
కరోనా దెబ్బకు ప్రజారవాణా వ్యవస్థ అతలాకుతలమైంది. ఇప్పుడిప్పుడే అన్ని సర్వీసులు మొదలవుతున్నాయి. త్వరలోనే.. హైదరాబాద్‌లో సిటీ బస్సులు నడిపేందుకు.. టీఎస్ఆర్టీసి సన్నద్ధమవుతోంది. ఈ మేరకు అధికారులు ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. నగరంలో సిటీ సర్వీసులు ప్రారంభం కాకపోవడంతో.. ఉద్యోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిటీ బస్సుల విషయంలో ఇంకా ఆలస్యం చేస్తే.. ఆర్టీసీ ఆదాయంపైనా తీవ్ర ప్రభావం పడనుంది. అందువల్ల.. నగరంలో సిటీ బస్ సర్వీసులను పునరుద్ధరించాలని సిటీ పబ్లిక్ కోరుతున్నారు.

కరోనాకు ముందు ఆర్టీసీకి రోజుకు రూ.12కోట్లు ఆదాయం, ఇప్పుడు 2కోట్లు దాటడం లేదు:
రాష్ట్రంలో పది వేల బస్సులుంటే.. 30 నుంచి 50 శాతం బస్సులు మాత్రమే జిల్లాల్లో నడుపుతున్నారు. కరోనాకు ముందు రాష్ట్రంలో ఆర్టీసీకి రోజుకు 12 కోట్ల ఆదాయం వచ్చేది. ఇప్పుడది.. 2 కోట్లు కూడా దాటడం లేదు. అన్ లాక్‌ 4లో భాగంగా.. దేశవ్యాప్తంగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ గాడిన పడుతుండటంతో.. ఆర్టీసి అధికారులు కూడా నగరంలో సిటీ బస్సులు నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కానీ.. భాగ్యనగరంలో ప్రస్తుతమున్న కరోనా పరిస్థితుల్లో.. సిటీ సర్వీసులు నడపాలా.. వద్దా అన్న అయోమయ స్థితి నెలకొంది.

మొదట 50 శాతం బస్సులు అందుబాటులోకి:
త్వరలోనే సిటీ బస్సులు రోడ్డెక్కేలా గ్రేటర్ ఆర్టీసీ ప్రణాళికలు రచిస్తోంది. హైదరాబాద్ పరిధిలో.. సిటీ బస్సులు నడిపేందుకు ఉన్న అవకాశాలతో పాటు ప్రజల స్పందనపై నివేదిక ఇవ్వాలని.. ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ నగర ఆర్టీసి అధికారులను కోరారు. దీంతో.. గ్రేటర్ ఈడీతో సహా ఇతర అధికారులు మహారాష్ట్ర, కర్ణాటక, చెన్నై రాష్ట్రాల్లో అధ్యయనం చేసి వచ్చి.. ఇటీవలే రిపోర్ట్ ఇచ్చారు.

ప్రభుత్వం అనుమతిస్తే.. మొదట 50 శాతం బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. పబ్లిక్ తాకిడి ఎక్కువగా ఉండే ఏడు రూట్లలో ముందుగా సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ రూట్లలో.. పబ్లిక్ నుంచి వచ్చే స్పందన చూసి.. ఇతర మార్గాల్లో బస్సులు నడపాలా.. వద్దా.. అనేది నిర్ణయించనున్నారు.

గ్రేటర్ పరిధిలో 3 వేల 4 వందల బస్సులు ఉండగా.. సుమారు 700 బస్సులను కాలం చెల్లినవిగా గుర్తించి.. స్క్రాప్‌కు పంపారు. సిటీ బస్సుల్లో కరోనా నిబంధనల అమలు సాధ్యాసాధ్యాలపై.. ఓ నిర్ణయానికి వచ్చాక.. సిటీ బస్ సర్వీసులపై ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది.Related Posts