భారత్‌ టార్గెట్‌గా చైనా మరో కుట్ర, ఆన్‌లైన్‌ గేమింగ్‌ ముసుగులో మనీ లాండరింగ్‌, 1100 కోట్ల టర్నోవర్‌లో 110 కోట్లు విదేశాలకు తరలింపు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

భారత్‌ టార్గెట్‌గా డ్రాగన్ కంట్రీ మరో కుట్ర పన్నుతుందా..? దేశ ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీసేందుకు చైనా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయా..? ప్రధానంగా యువతను టార్గెట్ చేస్తూ…ఆన్‌లైన్‌ గేమింగ్‌ ముసుగులో హద్దులు దాటుతోందా..? అంటే అవుననే సమాధానం విన్పిస్తుంది. ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ ముఠాకు సంబంధించి సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. తవ్వేకొద్ది అక్రమాలు బయటకొస్తున్నాయి.
ఏడున్నర నెలల్లోనే రూ.1100 కోట్లు టర్నోవర్‌:
ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ గేమ్‌తో అమాయక ప్రజలను మోసం చేసి వేల కోట్లు వసూలు చేసిన చైనా కంపెనీల వ్యవహారంలో….కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. తవ్వే కొద్ది అక్రమాలు బయటపడుతుండటంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దూకుడు పెంచింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న చైనా జాతీయుడు యాన్‌ హూ సహా ముగ్గురిని ఈడీ కస్టడీలోకి తీసుకుంది. వివిధ వెబ్‌సైట్ల ఆధారంగా దందా చేసిన నిర్వాహకులు…ఈ ఏడాది ఏడున్నర నెలల్లోనే 1100 కోట్లు టర్నోవర్‌ చేయడంతో పాటు 110 కోట్లను విదేశాలకు తరలించేశారు. అయితే దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఈడీ నిర్ణయించింది.

గుట్టు రట్టు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు:
మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌తోనూ ముడిపడి ఉన్న ఈ వ్యవహారం గుట్టును హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆగస్టు 13న రట్టు చేశారు. దీనిపై ఈడీకి ఓ సమగ్రమైన లేఖ రాశారు. ఈ దందాలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్‌ జరిగి ఉంటుందని అనుమానిస్తూ పూర్తి వివరాలను సమర్పించారు. వీటి ఆధారంగా ఈడీ సెప్టెంబర్ 15న యాన్‌ హూతో పాటు ఢిల్లీ వాసులు ధీరజ్‌ సర్కార్, అంకిత్‌ కపూర్‌లపై మనీ లాండరింగ్‌ కేసు నమోదు చేసింది.
ఆధారాల సేకరణ కోసం ఢిల్లీ, గుర్గావ్, ముంబైల్లోని మొత్తం 15 ప్రాంతాల్లో ఈడీ దాడులు చేసి..17 హార్డ్‌ డిస్క్‌లు, 5 ల్యాప్‌టాప్‌లు, ఫోన్లతో పాటు అనేక పత్రాలను స్వాధీనం చేసుకుంది. అనంతరం…చంచల్‌గూడ జైల్లో ఉన్న నిందితుల్ని తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీన్ని విచారించిన కోర్టు ఎనిమిది రోజుల పాటు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఈ-కామర్స్‌ వెబ్‌సైట్ల ముసుగులో కలర్‌ ప్రిడెక్షన్‌ గేమ్‌:
చైనాకు చెందిన బీజింగ్‌ టి పవర్‌ సంస్థ సౌత్‌ఈస్ట్‌ ఏషియా ఆపరేషన్స్‌ హెడ్‌గా యాన్‌ హూ పని చేస్తున్నాడు. గుర్గావ్‌ కేంద్రంగా వ్యవహారాలు నడుపుతున్న ఇతగాడు ఢిల్లీ వాసులు ధీరజ్‌ సర్కార్, అంకిత్‌ కపూర్‌ తదితరులను డైరెక్టర్లుగా ఏర్పాటు చేసుకున్నాడు. వీరంతా కలిసి ఈ-కామర్స్‌ సంస్థల ముసుగులో గ్రోవింగ్‌ ఇన్ఫోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, సిలీ కన్సల్టింగ్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, పాన్‌యన్‌ టెక్నాలజీస్‌ సర్వీస్,

READ  చేయి కొరికింది.. మెడపై రక్కింది : మద్యం మత్తులో పోలీసులకు చుక్కలు చూపించింది
లింక్‌యన్‌ టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్, డాకీపే ప్రైవేట్‌ లిమిటెడ్, స్పాట్‌పే ప్రైవేట్‌ లిమిటెడ్, డైసీలింగ్‌ ఫైనాన్షియల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, హువాహు ఫైనాన్షియల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో ఆర్‌ఓసీలో రిజిస్టర్‌ చేశారు. ఇవన్నీ ఆన్‌లైన్‌లో వివిధ ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లు నడుపుతున్నాయి. వీటి ముసుగులో కలర్‌ ప్రిడెక్షన్‌ గేమ్‌ను వ్యవస్థీకృతంగా సాగించారు. ఈ గేమ్‌కు సంబంధించిన పేమెంట్‌ గేట్‌ వే అయిన పేటీఎం, గూగుల్‌ పేల ద్వారా లావాదేవీలు జరిగాయి.

1100 కోట్ల టర్నోవర్‌లో 110 కోట్లు వెళ్లినట్లు ఆధారాలు:
ఇక ఈ బెట్టింగ్‌కు సంబంధించిన డబ్బు..డాకీ పే, లింక్‌ యన్‌ సంస్థలకు వెళ్ళిందని…అక్కడి నుంచి హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకు ఖాతాలోకి వెళ్ళినట్లు ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఇది అంతర్జాతీయ బ్యాంకు కావడంతో ఆ ఖాతాల్లోని నగదు హంకాంగ్, సింగపూర్‌ల్లోని కొన్ని ఖాతాల్లోకి మళ్ళినట్లు తేల్చారు.

ఇలా 1100 కోట్ల టర్నోవర్‌లో 110 కోట్లు వెళ్ళినట్లు ఆధారాలు లభించాయి. మిగిలిన మొత్తం కూడా విదేశాలకే తరలించేసి ఉంటారని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులోని నాలుగు ఖాతాల్లో ఉన్న 46 కోటల 96 లక్షలను ఈడీ ఫ్రీజ్‌ చేసింది. ఇక ఇప్పుడు…ఈ వ్యవహారంలో మనీలాండరింగ్‌ను నిగ్గు తేల్చడానికి ఈడీ రంగంలోకి దిగింది. మరి.. ఈడీ విచారణలో డ్రాగన్‌ కంట్రీ అక్రమాలు ఇంకెన్ని వెలుగులోకి వస్తాయో చూడాలి.Related Posts