Home » బోయిన పల్లి కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియ ప్రధాన సూత్రధారి-సీపీ అంజనీకుమార్
Published
2 months agoon
Hyderabad CP Anjani Kumar press meet on AkhilaPriya role in Bowenpally kidnap case : బోయిన పల్లి కిడ్నాప్ కేసుకు సంబంధించి ఏపీ మాజీ మంత్రి అఖిల ప్రియతో సహా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని హైదరాబాద్ నగర పోలీసు కమీషనర్ అంజనీ కుమార్ చెప్పారు. కిడ్నాప్ లో ప్రధాన సూత్రధారి భూమా అఖిల ప్రియ అని ఆయన తెలిపారు. నిందితులు రెగ్యులర్ గా వాడే సిమ్ కార్డులకు బదులుగా కొత్త సిమ్ కార్డులు తీసుకుని ఈకిడ్నాప్ వ్యవహారానికి తెర తీశారు అని ఆయన చెప్పారు.
మల్లికార్జున రెడ్డి ద్వారా వీరు సిమ్ కార్డులు కొనుగోలు చేశారని తెలిపారు. భూమా అఖిల ప్రియ వద్ద మూడేళ్లుగా పర్సనల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కర్నూలు జిల్లాకు చెందిన బోయసంపత్ కిడ్నాప్ కు సంబంధించి రెక్కీ నిర్వహించాడని ఆయన తెలిపారు. అనంతరం బాలచెన్నయ్య అనే వ్యక్తి బైక్ మీద వచ్చి మరోసారి రెక్కీ నిర్వహించాడు. వీరిద్దరు నిర్వహించిన రెక్కీ వివరాలను బోయ సంపత్, అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ కు, గుంటూరు శ్రీనుకు ఇచ్చారు. గుంటూరు శ్రీను కిడ్నాప్ నిర్వహించాడు.
ఈ కేసు విచారణలో కొత్త కోణం వెలుగు చూసిందని…ముఠా మొదట కూకట్ పల్లిలోని ఒక హోటల్ లో బస చేశారన్నారు. జనవరి 5న ఏ1 గా ఉన్నభూమా అఖిల ప్రియకు ఈ ముఠా ఎలా కిడ్నాప్ చేయబోతున్నారో వివరించింది. ఆసమయంలో ఆమె విజయవాడలో ఉందని ఆయన తెలిపారు. కిడ్నాప్ ముఠా కూకట్ పల్లిలోని లోధా అపార్ట్మెంట్స్ నుంచి ప్రారంభించారు. అక్కడినుంచి యుసఫ్ గూడలో ఉన్నభార్గవ్ రామ్ కు చెందిన స్కూల్ వద్దకు వచ్చారు. అక్కడ ద్విచక్ర వాహనాలు, కార్లకు నెంబర్ ప్లేట్లు మార్చారు.
గుంటూరు శ్రీను అఖిలప్రియ, భార్గవ్ రామ్ తో టచ్ లో ఉన్నాడని ఆయన చెప్పారు. గుంటూరు శ్రీను రెగ్యులర్ గా వాడే నెంబరు నుంచి కాకుండా కొత్త నెంబరు తీసుకుని కిడ్నాప్ టైమ్ లో అఖిల ప్రియతో మాట్లాడాడు. భూమా అఖిల ప్రియ కూడా విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే సమయంలో తను రెగ్యులర్ గా వాడే ఫోన్ నెంబర్ బదులు వేరే నంబర్ తీసుకుని దాని ద్వారా గుంటూరు శ్రీనుతో మట్లాడారు అని ఆయన ఆధారాలతో వివరించారు.
కిడ్నాప్ ముఠా బోయిన్ పల్లిలో ప్రవీణ్ రావు సోదరులను కిడ్నాప్ చేసారు. ఈవిషయాన్ని గుంటూరు శ్రీను తన నెంబర్ నుంచి అఖిల ప్రియ కు ఫోన్ చేసి చెప్పాడు. కిడ్నాప్ ముఠా నగరం దాటకుండానే పోలీసులు అలర్టై గాలింపు చేపట్టటంతో గుంటూరు శ్రీను తను తీసుకున్న టెంపరరీ నెంబరు నుంచి నార్త్ జోన్ డీసీపీ కి ఫోన్ చేసి… కిడ్నాప్ అయినవాళ్లు క్షేమంగా ఉన్నారని చెప్పారు. అదే నెంబరు నుంచి అఖిల ప్రియకు కిడ్నాప్ వ్యవహారాన్ని వివరించాడని అంజనీకుమార్ తెలిపారు.
ఇలాంటి అనేక ఆధారాలతో కిడ్నాప్ వ్యవహారంలో అఖిల ప్రియపాత్ర నిరూపించబడిందని ఆయన అన్నారు. ఆ సమయంలో అఖిలప్రియ విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చారు అని సీపీ చెప్పారు. ఇప్పటి వరకు 19 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని వారందరి గురించి త్వరలో వివరిస్తామని ఆయన అన్నారు. గుంటూరు శ్రీను టెంపరరీ సిమ్ కార్డు తీసుకుని అఖిలప్రియతోనూ, మిగతా సభ్యులతో మాట్లాడంతో ఆధారాలు బయట పడ్డాయని సీపీ వివరించారు.
అఖిలప్రియను అరెస్ట్ చేయటానికి మహిళా పోలీసులు రాలేదని వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. అఖిలప్రియను అరెస్ట్ చేయటానికి వచ్చిన మహిళా పోలీసు అధికారుల పేర్లు ఆయన తెలిపారు. అఖిల ప్రియ అరెస్ట్ అనంతరం గాంధీ ఆస్పత్రిసూపరింటెండెంట్ పర్యవేక్షణలో ప్రముఖ డాక్టర్లు ఆమె ఆరోగ్యాన్ని పరీక్షించారని ఆయన చెప్పారు.
ఆ తర్వాత మెజిస్ట్రేట్ గారి ఆదేశాల ప్రకారం ఉస్మానియా ఆస్పత్రికి చెందిన ప్రముఖ వైద్యులు జైలుకు వచ్చి అఖిల ప్రియను పరీక్షించారు.ఆమె ఆరోగ్యం బాగానే ఉందని వారు ధృవీకరించారని సీపీ మహేష్ భగత్ వివరించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని అంజనీ కుమార్ తెలిపారు.