వేర్వేరు గొంతులతో మాట్లాడి వ్యాపారులను దోచుకుంటున్న ఘరానా మోసగాడు అరెస్ట్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఘరానా మోసగాడిని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి వేర్వేరు గొంతులతో మాట్లాడటంలో దిట్ట. ఆ టాలెంట్ ను ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నాడు. వ్యాపారులను దండుకుంటున్నాడు. చివరికి పాపం పండి పోలీసులకు చిక్కాడు.

ఒకే వ్యక్తి.. వేర్వేరు నంబర్ల నుంచి వేర్వేరు వ్యక్తులుగా గొంతు మార్చి మాట్లాడతాడు. ట్రాన్స్ పోర్టు బిజినెస్ ఒప్పందాల పేరుతో వ్యాపారులను బోల్తా కొట్టిస్తూ.. వారి నుంచి పెద్ద మొత్తంలో నగదు దండుకుంటాడు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన దూళ్ల నాగేశ్వరరావు(45) గాజులరామారంలో నివాసం ఉంటున్నాడు. ఐదేళ్లుగా రవాణా ఒప్పందాల పేరుతో వాహన యజమానులను మోసం చేస్తున్నాడు. ఇటీవల అఫ్జల్‌గంజ్‌కు చెందిన రవాణా వ్యాపారి గోవిందరాజుకు ఫోన్‌ చేసి సుబ్బారెడ్డిగా పరిచయం చేసుకున్నాడు. మియాపూర్‌కు చెందిన మల్లయ్య.. శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రయాణికులకు రవాణా సౌకర్యాలను కల్పిస్తారని, మీ నుంచి వాహనాలను అద్దెకు తీసుకోవాలనుకుంటున్నారని చెప్పి అనుమానాల నివృత్తి కోసం, అప్పటికే ఇద్దరు ఒప్పందాలు కుదుర్చుకున్నారని వారి ఫోన్‌ నంబర్లు ఇచ్చాడు.

గోవిందరాజు ఆ నంబర్లకు ఫోన్‌ చేయగానే నిందితుడే వేర్వేరు గొంతులతో మాట్లాడి నమ్మించాడు. రెండు బస్సులు ఇచ్చేందుకు సిద్ధపడిన గోవిందరాజు.. రూ.92 వేలు నిందితుడి ఖాతాలో జమ చేశాడు. ఒప్పంద పత్రాలపై సంతకాలకు ఎయిర్ పోర్టుకి వెళ్లగా.. ఎవరూ రాకపోవడంతో మోసపోయానని గ్రహించి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వెంకటరామిరెడ్డి దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు. ఈ తరహాలో అతనిపై ఇప్పటికే పలు కేసులున్నట్లు గుర్తించారు.

Related Posts