బిర్యానీ కోసం 11ఏళ్ల బాలిక ఆత్మహత్య, హైదరాబాద్‌లో విషాదం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

హైదరాబాద్‌ నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. బిర్యానీ కోసం ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. బిర్యానీ తినే విషయంలో అన్నతో జరిగిన గొడవతో మనస్తాపం చెందిన బాలిక ఉరేసుకుని చనిపోయింది. మల్లాపూర్‌ డివిజన్‌‌లోని దుర్గానగర్‌కు చెందిన ప్రశాంతి, రవి దంపతులకు కొడుకు, కూతురు స్నేహ (11) ఉన్నారు. శనివారం(ఆగస్టు 1,2020) తల్లిండ్రులు కూలిపనికి వెళ్లారు. స్నేహ అన్నతో పాటు ఇంట్లోనే ఉంది. ఆ రోజు బక్రీద్ సందర్భంగా పక్కింట్లో ఉంటే కుటుంబం వారికి బిర్యానీ ఇచ్చింది.బిర్యానీ తినే విషయంలో అన్నతో గొడవ:
బిర్యానీ తినే విషయంలో అన్నకి, చెల్లికి గొడవ పడింది. కాసేపటి తర్వాత అన్న తన స్నేహితులతో ఆడుకునేందుకు బయటికి వెళ్లాడు. ఇంట్లోనే ఉన్న స్నేహ టవల్‌తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాసేపటి తర్వాత ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు ఉరికి వేలాడుతున్న కూతురిని చూసి నిర్ఘాంతపోయారు. వెంటనే నాచారంలోని ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించారు. కాగా, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాలిక మృతితో ఆ ఇంట్లో విషాదం అలుముకుంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు, ఆందోళన కలిగిస్తున్న పిల్లల తీరు:
చిన్న కారణానికే బాలిక ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా సంచలనం రేపింది. కుటుంబసభ్యులతో పాటు చుట్టుపక్కల వారిని విస్మయానికి గురి చేసింది. చక్కగా ఆడుతూ పాడుతూ బాల్యాన్ని గడపాల్సిన పిల్లలు ఇలాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడం నిర్ఘాంత పడేలా చేస్తోంది. పిల్లల ఆలోచన ధోరణి ఆందోళన కలిగిస్తోంది. పిల్లల్లో ఇలాంటి మనస్తత్వం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఫెయిల్ అయ్యామని కొందరు, తల్లిదండ్రులు తిట్టారని కొందరు, టీచర్ మందలించాడని కొందరు, అడిగింది కొనివ్వలేదని మరికొందరు.. ఇలా చిన్న చిన్న కారణాలకే మనస్తాపానికి గురవుతున్నారు. కలత చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇది మంచి పరిణామం కాదని, పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వాలని, వారి ఆలోచన తీరులో మార్పు తీసుకురావాలని నిపుణులు చెబుతున్నారు.

Related Posts