telangana cm kcr will be announing lockdown in hyderabad

హైదరాబాద్‌లో లాక్‌డౌన్..!! పాటించాల్సిన నియమాలివే

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా మహమ్మారి గురించి ప్రజలు భయపడుతున్నట్టే కనిపిస్తున్నా అలసత్వం కూడా ప్రదర్శిస్తున్నారు. అవసరం లేకున్నా బయటికొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో కష్టంగా గడిపిన వారంతా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా విందులు, వినోదాల పేరుతో వైరస్‌ను కొని తెచ్చుకుంటున్నారు. కేసుల సంఖ్య ఎక్కువ కావడానికి కారణమవుతున్నారు. ప్రజల్లోని అలసత్వమే వైరస్‌ విస్తృతికి ప్రధాన కారణంగా కనిపిస్తోందని వైద్య నిపుణులు అంటున్నారు. మాస్కులు ధరించే వారి సంఖ్య పెరిగినా.. ఇప్పటికీ కొందరు లైట్‌ తీసుకుంటున్నారు.

ముఖ్యంగా గుంపుల్లో తీసుకోవలసిన కనీస జాగ్రత్తలను విస్మరిస్తున్నారు. తెలంగాణలో తొలుత కొద్ది రోజులు కేసులు తగ్గుముఖం పట్టినట్టు కనిపించినా.. ఇప్పుడు క్రమేణా పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కేసుల సంఖ్య పరుగులు తీస్తోంది. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన తర్వాత సిటీలో కేసులు పెరుగుతున్నాయి. పరిస్థితులు ఇలానే కొనసాగితే రాబోయే రోజుల్లో మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు.

ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడమే మంచిదని సూచిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం కేబినెట్‌ భేటీలో చర్చించి ఒక నిర్ణయానికి వస్తుందని అంటున్నారు. ప్రభుత్వం కూడా దాదాపుగా లాక్‌డౌన్‌ విధించేందుకు సిద్ధంగా ఉందని చెబుతున్నారు. కరోనా వైరస్‌ నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని మూడు, నాలుగు రోజుల్లో ఖరారు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. తమిళనాడు రాజధాని చెన్నైలో వైరస్‌ వ్యాప్తి నివారణకు మళ్లీ లాక్‌డౌన్‌ విధించారని సీఎం కేసీఆర్‌ అన్నారు.

హైదరాబాద్‌లో 15 రోజులపాటు లాక్‌డౌన్‌ విధించాలని వైద్య శాఖ నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. హైదరాబాద్‌ కోటి మంది నివసిస్తున్న పెద్ద నగరం. ఇక్కడ వ్యాప్తి తీవ్రమైతే పరిస్థితులు చేజారిపోయే ప్రమాదం ఉంది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా లాక్‌డౌన్‌ విధించడమే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత ప్రజల కదలికలు పెరగడంతో కరోనా వైరస్‌ వ్యాప్తి జీహెచ్‌ఎంసీ పరిధిలో లాక్‌డౌన్‌ విధించడం అనేది చాలా పెద్ద నిర్ణయమే. ఆ దిశగా ప్రజలను ప్రభుత్వ యంత్రాంగం సన్నద్థం చేయాల్సి ఉంటుంది.

ప్రధానంగా పోలీసు యంత్రాంగాన్ని సిద్థం చేయాలి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఒకవేళ లాక్‌డౌన్‌ అమలు చేస్తే మాత్రం కఠిన నిర్ణయాల అవలంబించాల్సిందే. నిత్యావసర సరుకులు కొనుగోలుకు వీలుగా ఒకటి, రెండు గంటలు మాత్రమే సడలింపునిచ్చి రోజంతా కర్ఫ్యూ విధించాల్సి ఉంటుందని భావిస్తున్నారు. విమానాలు, రైళ్ల రాకపోకలను ఆపాల్సి ఉంటుంది.

మరోపక్క, కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రంలో కిరాణం దుకాణాలు, వ్యాపార సంస్థల నిర్వాహకులు వేళల విషయంలో నియంత్రణ పాటిస్తున్నారు. సాయంత్రం ఐదారు గంటల వరకే షాపులను తెరుస్తున్నారు. కొన్ని చోట్ల మధ్యాహ్నానికే బంద్‌ చేస్తున్నారు. ఇంకొన్ని చోట్ల సంపూర్ణ బంద్‌ పాటిస్తున్నారు. జిల్లా, మండల కేంద్రాల్లో పరిమిత సమయాల్లోనే నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ వ్యాపార, ఇతర అసోసియేషన్‌లు సమావేశమై తీర్మానాలు చేస్తున్నాయి. కొన్ని చోట్ల వ్యాపారులు, ప్రజాప్రతినిధులు జేఏసీలుగా ఏర్పడి నిర్ణయం తీసుకుంటున్నారు. ఇందుకు ప్రజలు కూడా సహకరిస్తున్నారు.

తెలంగాణలోని పలు జిల్లాల్లో స్వచ్ఛందంగానే వ్యాపార, వాణిజ్య సంస్థలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. నిత్యావసరాల షాపులు మాత్రం కొద్ది గంటలు తెరచి ఉంటున్నాయి. కొన్ని చోట్ల ఆదివారాలు పూర్తిగా బంద్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వినియోగదారులతో కిటకిటలాడే హైదరాబాద్‌లోని బేగంబజార్‌లో 20 మందికి పైగా కరోనా సోకడం, వారిలో ముగ్గురు మృతిచెందడంతో వ్యాపార కార్యకలాపాలు మూతపడ్డాయి. ఆల్వాల్‌లో జూలై 6వ తేదీ దాకా స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటించాలని వ్యాపారులు నిర్ణయించారు. ఎర్రగడ్డ రైతుబజార్‌లో సోమవారం నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు.