hyderabad special taskforce to identify people who returned from delhi markaz

సమయం లేదు మిత్రమా, ఢిల్లీ నుంచి తెలంగాణ వచ్చిన వారిని గుర్తించేందుకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా వైరస్ మహమ్మారి అదుపులోకి వచ్చింది అని కేంద్రం ప్రభుత్వం అనుకుంటున్న సమయంలో ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ బాంబు పేలింది. ఒక్కసారిగా దేశంలో కలకలం రేగింది.

కరోనా వైరస్ మహమ్మారి అదుపులోకి వచ్చింది అని కేంద్రం ప్రభుత్వం అనుకుంటున్న సమయంలో ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ బాంబు పేలింది. ఒక్కసారిగా దేశంలో కలకలం రేగింది. అనూహ్యంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్ లో జరిగిన తబ్లిగీ జమాత్‌ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి కరోనా సోకింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి వేల మంది ప్రార్థనల్లో పాల్గొన్నారు. వారంతా సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. దీంతో ఒక్కసారిగా అలజడి రేగింది. తెలుగు రాష్ట్రాలకు కూడా ఢిల్లీ దడ పట్టుకుంది. ఏపీ, తెలంగాణ నుంచి సుమారు 2వేల మంది ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్నారన్న విషయం నిద్ర లేకుండా చేస్తోంది.

ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో ఆరుగురు కరోనాతో మృతి:
ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొని తెలంగాణ తిరిగి వచ్చిన వారిలో ఆరుగురు కరోనాతో మరణించారు. అందులోనూ ఐదుగురు ఒకేరోజు మరణించడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. పోలీసులను అలర్ట్ చేసింది. ఆపరేషన్ ఢిల్లీ రిటర్న్ చేపట్టింది ప్రభుత్వం. ఢిల్లీ నుంచి తెలంగాణకు తిరిగి వచ్చిన వారి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని గ్రహించిన ప్రభుత్వం.. కరోనా కట్టడికి రెడీ అయ్యింది. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వారిని గుర్తించాలని పోలీసులకు సూచించింది. ఈ పని యుద్ధ ప్రాతిపదికన జరగాలంది. దీంతో పోలీసు శాఖ రంగంలోకి దిగింది.

వారి ఆచూకీ కనిపెట్టేందుకు స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌:
సోమవారం(మార్చి 30,2020) అర్ధరాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి భేటీ అయ్యారు. ఆ తర్వాత అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో డీజీపీ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఢిల్లీకి వెళ్లొచ్చిన వారిలో చాలామంది కరోనా బాధితులుండే అవకాశాలు ఉండటంతో వారి ఆచూకీ కనిపెట్టేందుకు రాత్రికి రాత్రి స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏటు చేయాలని ఆయన ఆదేశించారు. దీంతో అర్ధరాత్రి విధుల్లో ఉన్న పోలీసుల్లో కొందరిని ప్రత్యేక బృందాలుగా విడదీసి, గాలింపు తీవ్రతరం చేశారు. వైద్యారోగ్య శాఖతో కలిసి పోలీసులు చేపట్టిన ఈ ఆపరేషన్‌ను జిల్లా పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం(మార్చి 31,2020) ఉదయానికే అన్ని జిల్లాల్లోని మతపెద్దలతో పోలీసులు సమావేశమయ్యారు. పరిస్థితి తీవ్రతను తెలిపి, ఎవరెవరు ఢిల్లీ వెళ్లారో తెలుసుకునేందుకు యత్నించారు. వెయ్యి మందికిపైగానే ఉంటారన్న అంచనాకు వచ్చారు.

గూగుల్‌ మ్యాప్‌ సాయంతో:
ఆచూకీ లభించిన వ్యక్తులతో పాటు వారి కుటుంబసభ్యులు, సన్నిహితంగా మెలిగిన వారినీ క్వారంటైన్‌కు పంపుతున్నారు. వీరి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని, గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా వారు ఢిల్లీ వెళ్లొచ్చాక ఎక్కడెక్కడ తిరిగారో వెతికే పనిలో పడ్డారు. గూగుల్‌ మ్యాప్‌లో ఉన్న ఈ సదుపాయం ఆధారంగా ఒక వ్యక్తి రోజూ ఏం చేశాడు? ఎక్కడెక్కడ తిరిగాడు? తదితర సమాచారమంతా క్లియర్‌గా మ్యాప్‌లో కనిపిస్తుంది. దీని ఆధారంగా పోలీసులు మిగిలిన వారిని అప్రమత్తం చేసే పనిలోపడ్డారు.
 
60శాతం మంది హైదరాబాద్‌ పరిసరాల్లోనే:
ఢిల్లీ వెళ్లొచ్చిన వారి సంఖ్యపై మధ్యాహ్నానికి పోలీసు, ఆరోగ్య శాఖలు ఒక నిర్ధారణకు వచ్చాయి. జిల్లాల వారీగా.. వెయ్యిమందికిపైనే ఉండొచ్చని అంచనా. వీరిలో 60 శాతం మంది హైదరాబాద్‌ పరిసరాలకు చెందిన వారేనని గుర్తించారు. తాజాగా మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రార్థనలకు హాజరై వస్తున్న 32 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని క్వారంటైన్‌కు తరలించారని సమాచారం. తెలంగాణ నుంచి ప్రార్థనలకు హాజరైన వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చనే అనుమానాలున్నాయి. వీరంతా రైలు, రోడ్డు, విమాన సర్వీసుల్లో తిరిగి వచ్చారు. పైగా అందరూ ఒకేరోజు రాలేదు. తిరుగు ప్రయాణంలో వీరి ద్వారా ఎంతమందికి సంక్రమించి ఉంటుందన్నది ఆందోళన కలిగిస్తోంది.

కరోనా లక్షణాలున్న వారు ముందుకు రండి.. 104, 100కు డయల్ చేయండి:
విదేశాలకు లేదా ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు, కరోనా లక్షణాలు ఉన్నవారు స్వచ్ఛందంగా ముందుకు రావాలని డీజీపీ కార్యాలయం మరోసారి విజ్ఞప్తి చేసింది. తబ్లిగీ జమాత్‌ కోసం ఢిల్లీకి వెళ్లొచ్చిన వారి కోసం గాలిస్తున్నామని, అటువంటి వారంతా స్వచ్ఛందంగా ముందుకు రావాలని, తద్వారా ఎంతో మేలుచేసిన వారవుతారని తెలిపింది. నేరుగా సమాచారం అందించలేని వారు, హెల్ప్‌లైన్‌ నంబరు 104, డయల్‌ 100 లేదా సోషల్‌ మీడియా ద్వారానైనా తెలపాలని కోరింది.

‘ఢిల్లీ’అనుమానితులకు గాంధీలో వైద్యపరీక్షలు:
ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లి తిరిగి నగరానికి చేరుకున్న వారికి గాంధీ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ పరిధి, మిగతా జిల్లాల నుంచి 1,030 మంది ప్రార్థనలకు వెళ్లినట్టు గుర్తించిన వారితోపాటు వారి కుటుంబసభ్యులను పోలీసులు, జీహెచ్‌ఎంసీ యంత్రాంగం గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఓపీ విభాగంలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి 250 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. కరోనా లక్షణాలు గల 117 మందిని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. మిగిలిన వారి వివరాలు సేకరించి హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.

గాంధీ ఆసుపత్రిలో టెంట్లు వేసి మరీ పరీక్షలు:
బుధవారం(ఏప్రిల్ 1,2020) మరికొందరికి పరీక్షలు నిర్వహిస్తామని గాంధీ ఆసుపత్రి అధికారులు గాంధీ ప్రధాన ద్వారం దగ్గర రహదారులను మూసివేసిన పోలీసులు బాధితులు, అనుమానితులు ఆస్పత్రి బయటకు వెళ్లకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, గాంధీలో కరోనా ఐసీయూలో 65 మంది బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ప్రధాన భవనంలోని 7, 8 అంతస్తులు బాధితులు, అనుమానితులతో పూర్తిగా నిండిపోవడంతో కొత్తగా వచ్చిన వారికి 6వ అంతస్తు కేటాయించారు. ఆస్పత్రి ప్రాంగణంలో జీహెచ్‌ఎంసీ సిబ్బంది టెంట్లను వేసింది. ఉస్మానియా ఆస్పత్రి నుంచి నలుగురు ల్యాబ్‌ టెక్నీషియన్లు గాంధీకి డెప్యుటేషన్‌పై వచ్చారు. వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి నుంచి తెచ్చిన 20 వెంటిలేటర్లతో గాంధీలో సుమారు 70 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి. గాంధీ గైనకాలజీ విభాగాన్ని కోఠిలోని సుల్తాన్‌ బజార్‌ మెటర్నిటీ ఆస్పత్రికి తరలించారు.

* ప్రపంచవ్యాప్తంగా 8.57లక్షల కరోనా కేసులు, 42వేల 100 మరణాలు
* భారత్ లో 1619 కరోనా కేసులు, 46 మరణాలు, కోలుకున్న వారు 142మంది
* ఇటలీలో ఒక్క రోజే 837 మంది, స్పెయిన్ లో 748 మంది, ఫ్రాన్స్ లో 499 మంది, బ్రిటన్ లో 381 మంది, ఇరాన్ లో 141 మంది, నెదర్లాండ్స్ లో 175 మంది, బెల్జియంలో 192 మంది మృతి
* అమెరికాలో ఇప్పటివరకు 3వేల 867 మంది మరణం

Also Read | సెర్బియాకు భారత్ కరోనా సాయం : 90 టన్నుల రక్షణ కిట్స్ పంపింది

Related Tags :

Related Posts :