లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

మూఢనమ్మకంతో దారుణం, చేతబడి అనుమానంతో అల్లుడి సజీవదహనం

Published

on

black magic murder: అది రాత్రి సమయం.. ఓ గది నుంచి మంటలు.. బయటి నుంచి ఆ గదికి తాళం.. మంటలు ఆర్పేలోపే ఆ గదిలో ఒకరు సజీవదహనం.. విషయం తెలుసుకున్న పోలీసులు…వెంటనే అక్కడికి చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి భార్య, కుటుంబసభ్యులు నుంచి ఏం జరిగిందనే దానిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాంతో అసలు విషయం వెలుగు చూసింది. పక్కా ప్లాన్‌ ప్రకారం అతడ్ని చంపేశారనే విషయం తేలింది. మరి ఎవరు చంపారు..? ఎందుకు చంపారు..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు తెరపైకి వచ్చాయి.

అనారోగ్యంతో జగన్ మృతి:
హైదరాబాద్‌‌లోని అల్వాల్‌కు చెందిన సాప్ట్‌వేర్‌ ఉద్యోగి పవన్‌(37)కు జగిత్యాల జిల్లా బల్వంతపూర్‌కు చెందిన కృష్ణవేణితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. కృష్ణవేణికి విజయ్, జగన్ అనే ఇద్దరు సోదరులు ఉన్నారు. సీన్‌కట్‌ చేస్తే…ఇటీవల కృష్ణవేణి రెండో అన్న జగన్ అనారోగ్యం బారినపడి మృతి చెందాడు. దాంతో కృష్ణవేణి రెండు రోజుల క్రితమే..పుట్టింటికి రాగా…పవన్‌ సోమవారం సాయంత్రం సమయంలో బావ మరిది ఇంటికి చేరుకున్నాడు. వచ్చి రాగానే జగన్‌ భార్యతో పాటు కుటుంబసభ్యులను పరామర్శించి..గదిలో ఉన్న జగన్ చిత్ర పటం వద్ద నివాళులు అర్పించేందుకు వెళ్లాడు.

గదికి తాళం వేసి పెట్రోల్ పోసి సజీవదహనం:
అయితే పవన్‌ క్షుద్రపూజలు చేయించాడని… ఆ కారణంతోనే జగన్‌ చనిపోయాడని…అతడి భార్య, కుటుంబసభ్యులు..పవన్‌పై అనుమానం పెంచుకున్నారు. అంతేకాదు ఆ అనుమానం పవన్‌ను చంపేయాలనేంత వరకు వెళ్లింది. అందులో భాగంగానే…పవన్‌ గదిలోని జగన్‌ చిత్రపటం వద్దకు వెళ్లగానే బయటి నుంచి తాళం వేసి బంధించారు. అనంతరం పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. సోదరుడు విజయ్‌, మరో సోదరుడి భార్య సుమలత తన భర్తను చంపేస్తున్నారంటూ…పవన్‌ భార్య కృష్ణవేణి ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. కానీ…ఆ లోపే పవన్‌ సజీవదహనమయ్యాడు.

పక్కా ప్లాన్ ప్రకారమే మర్డర్:
పవన్‌ సజీవదహనమైన విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు హుటహుటీన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తిగా కాలిపోయిన డెడ్‌బాడీని చూసి కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబ గొడవలు, ఆస్తి తగాదాల నేపథ్యంలో పక్కా ప్లాన్ ప్రకారమే హతమార్చారని ఆరోపించారు. పవన్ భార్య కృష్ణవేణి, ఆమె సోదరుడు విజయ్, జగన్‌ భార్య సుమలత కలిసి చంపేశారని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఏడాదిగా పవన్, కృష్ణవేణి మధ్య గొడవలు:
ఏడాది నుంచి పవన్‌, కృష్ణవేణి మధ్య గొడవలు జరుగుతున్నాయని.. రాజీ కుదుర్చుదామని ప్రయత్నించినా అవేమీ ఫలించలేదని పవన్‌ తల్లిదండ్రులు చెబుతున్నారు. పవన్‌, కృష్ణవేణి సోదరుల మధ్య కూడా కొంతకాలంగా ఫోన్‌లోనే ఘర్షణలు జరుగుతున్నాయని వారు వాపోయారు. పక్కా ప్లాన్‌ ప్రకారమే తమ బిడ్డను దారుణంగా హత్య చేశారని…ఇందులో కృష్ణవేణి తల్లి పాత్ర కూడా ఉందని ఆరోపిస్తున్నారు.

పవన్ భార్య పాత్రపైనా అనుమానాలు:
అయితే పవన్‌ను బంధించి పెట్రోల్‌ పోసి తగలబెడుతున్న సమయంలో…భార్య కృష్ణవేణి అక్కడే ఉన్న అడ్డుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆమె పొంతనలేని సమాధానాలు..పవన్‌ కుటుంబసభ్యుల ఆరోపణలకు బలాన్ని చేకూర్చాయి.

ఒక మర్డర్, అనేక అనుమానాలు:
ఒక్కోక్కరి వాదన ఒక్కోలా ఉండటంతో పవన్‌ హత్యకు కారణాలేంటనేది అంతుచిక్కని ప్రశ్నగా మారిపోయింది. పక్కా స్కెచ్‌తోనే పవన్‌ను హత్య చేశారని తెలుస్తుండగా..మర్డర్‌ ప్లాన్‌లో పవన్‌ భార్య కృష్ణవేణి పాత్ర ఎంత ఉందనే దానిపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్లాన్‌ ప్రకారమే పవన్‌ను మాల్యలకు రప్పించారా అన్నది కూడా ఓ ప్రశ్నగా మిగిలిపోతోంది. పవన్‌-కృష్ణవేణి దంపతుల మధ్య విబేధాలున్నాయని..కృష్ణవేణి సోదరులతో కూడా గొడవలు జరుగుతున్నాయిని పవన్‌ పేరెంట్స్‌ చెబుతున్న దాంట్లో నిజమెంతో తేలాల్సి ఉంది. మరోవైపు జగన్‌ కుటుంబసభ్యులను పరామర్శించేందుకు పవన్‌, కృష్ణవేణి ఎందుకు కలిసి రాలేదనేది కూడా మిస్టరీగానే మిగిలింది. పవన్‌ హత్యలో ఇంకా ఎంత మంది పాత్ర ఉందనేది కూడా ఓ ప్రశ్నగా మారింది.

పోలీసులకు సవాల్ గా మారిన కేసు:
కొత్త ట్విస్టుల మధ్య సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సజీవదహనం కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. దీంతో కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు..సంజయ్, సుమలతతో పాటు పవన్‌ భార్య కృష్ణవేణిని కూడా అదుపులోకి తీసుకుకున్నారు. ఏం జరిగిందానే దానిపై కూపీ లాగుతున్నారు.

మూఢనమ్మకాలతో దారుణాలు:
ఓవైపు ప్రపంచమంతా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని పరుగులు పెడుతుంటే…మరోవైపు కొందరు ఇప్పటికీ మంత్రాలు, తంత్రాలు, చేతబడులు వంటి మూఢనమ్మకాల ఊబిలో కొట్టుమిట్టాడుతూ ఇలా అమానుషాలకు ఒడిగడుతున్నారు. అనుమానాలతో అమాయకులను హతమారుస్తున్నారు. బాధితుల కుటుంబాలకు అంతులేని విషాదాన్ని మిగులుస్తున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *