Home » పెళ్లికెళ్లిన అత్త..ఇల్లు దోచేసిన కోడలు : కన్నతల్లి కోసం కట్టుకున్నోడి ఇంటికే కన్నం
Published
2 months agoon
By
nagamaniHyderabad yapral theft case : ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడని పెద్దలు చెప్పిన సామెత. అటువంటిదే జరిగింది హైదరాబాద్ లోని పాతబస్తీలో. పెళ్లికి వెళ్లి వచ్చేసరికి ఇల్లంతా దొంగలు దోచుకుపోయారని ఓ కుంటుంబం లబోదిబోమంది. కానీ ఇంటిలో నగా నట్రాలో దోచేసింది ఇంటి కోడలేనని తెలిసి షాక్ అయ్యారు అత్తింటి వారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే..ఆమె దొంగతనం చేసింది తనకోసం కాదు తల్లి కోసం చేసిందని తెలిసింది. అప్పులపాలైపోయిన తల్లిని ఆ ఊబిలోంచి బైటపడేసేందుకు కూతురు అత్తింటికే కన్నం వేసింది. బంగారం, వెండి, డబ్బులు దొంగిలించిందని తేలింది.
వివరాల్లోకి వెళితే…హైదరాబాద్ లోని యాప్రాల్ కింది బస్తీకి చెందిన వెంకటస్వామి అనే వ్యక్తి టుంబం నవంబర్ 23న బంధువుల ఇంట్లో జరిగే పెళ్లికి వెళ్లారు. ఇంటి కోడలు ఇంటిలోనే ఉంది. మిగతావారంతా పెళ్లికి వెళ్లారు. పెళ్లికి వెళ్లినవారంతా తిరిగి వచ్చే సరికి ఇంట్లో జరగరానిదేదో జరిగినట్లు ఉంది ఇంటి పరిస్థితి చూస్తే. స్టోర్ రూంలో ఉండే సామాన్లన్నీ చెల్లాచెదురుగా పాడేసి ఉన్నాయి. అలాగే విలువైన వస్తువులు భద్రపరిచే కబోర్డ్స్ పగులగొట్టి ఉంది. దాంట్లో ఉండాల్సిన 44 తులాల బంగారం,15 తులాల వెండితో పాటు పదివేల వరకు నగదుకు కనిపించకుండాపోయాయి.
దీంతో కుటుంబ సభ్యులు స్థానిక జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తులో భాగంగా సీసీఎల్ మల్కాజ్గిరి, ఐటీ సెల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. ఈ ఫుటేజ్ లో ఒంటినిండా నల్లటి దుస్తులు కప్పుకొని వచ్చిన వ్యక్తిని గుర్తించారు. సదరు వ్యక్తిపై అనుమానం వచ్చి మరిన్ని సీసీటీవీల ఫుటేజీలను పరిశీలించగా.. దొంగతనం చేసింది మహిళేనని గుర్తించారు.
ఈకోణంలో సదరు మహిళ బాడీ లాంగ్వేజ్ ను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు ఆ ఇంటి యజమాని కోడలే చోరీ చేసినట్లుగా నిర్ధారించారు. దీంతో సదరు బాధిత కుటుంబం సభ్యులంతా ఆశ్చర్యపోయారు. మా ఇంటి కోడలికి మా ఇంట్లోనే దొంగతనం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని తెలుసుకుని షాక్ అయ్యారు.ఈక్రమంలో ఇంటి పెద్ద కోడలు సోనిని పోలీసులు విచారించగా తన తల్లితో కలిసి దొంగతనం చేసానని అంగీకరించింది.
ఇంటికి పెద్ద కోడలైన వాసగోని సోని, తల్లి లీలావతి మాటలు విని దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అప్పుల పాలైన తల్లికి సహాయం చేసేందుకే కోడలు అత్తింటికే కన్నం వేసిందని పోలీసులు తెలిపారు. సోని 2016లో చోరీ జరిగిన ఇంటి యజమాని కొడుకు విశ్వనాథ్‌ను ప్రేమ వివాహం చేసుకుందని..ఈ క్రమంలో తల్లిని అప్పుల నుంచి బైటపడేసేందుకు అత్తింటిలోనే చోరీ చేసిందని తెలిపారు.
సోనీ..ఆమె తల్లి లీలావతి నుంచి 44 తులాల బంగారం, 15 తులాల వెండి, రూ.10,500 నగదు రికవరీ చేసారు పోలీసులు . నిందితులు వాసగోని సోని, నేమూరి లీలావతిపై కేసు నమోదు చేసామని సీసీ మహేశ్ భగవత్వివరించారు.