139మంది అత్యాచారం కేసు.. డాలర్ భాయ్ కోసం పోలీసుల వేట, ఆఫీసులో అమ్మాయిల సర్టిఫికెట్లు, ఆడియో టేపులు

  • Published By: naveen ,Published On : August 30, 2020 / 03:00 PM IST
139మంది అత్యాచారం కేసు.. డాలర్ భాయ్ కోసం పోలీసుల వేట, ఆఫీసులో అమ్మాయిల సర్టిఫికెట్లు, ఆడియో టేపులు

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న యువతిపై 139 మంది అత్యాచారం కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో సంబంధం ఉన్న డాలర్ భాయ్ అలియాస్ రాజా శ్రీకర్ రెడ్డి కోసం సీసీఎస్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని సోమాజీగూడ దగ్గరున్న అమృత విల్లేలో 304లో డాలర్ భాయ్ నిర్వహిస్తున్న ఆఫీసుని పోలీసులు సీజ్ చేశారు. గాడ్ పవర్(God Power Foundation, Save The Humanity) పేరుతో స్వచ్చంద సంస్థ ఏర్పాటు చేసిన డాలర్ భాయ్, ఈ ఆఫీసులో తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. డాలయ్ భాయ్ ఆఫీసులో పోలీసులు కొందరు అమ్మాయిల సర్టిఫికెట్లు గుర్తించారు. డాలయ్ భాయ్ ఆఫీసులోకి సరిఫికెట్లు ఎలా వచ్చాయో తెలుసుకునే పనిలో పోలీసులు పడ్డారు. అలాగే డాలయ్ భాయ్ ఆఫీసులో పలు ఆడియో టేపులనూ పోలీసులు గుర్తించారు. డాలర్ భాయ్ పై ఇప్పటికే పలు జిల్లాల్లో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డాలర్ భాయ్ ను పట్టుకునేందుకు పోలీసులు వేటను ముమ్మరం చేశారు.

స్వచ్చంద సంస్థ ఏర్పాటు చేసిన డాలర్ భాయ్:
అత్యాచారం కేసుని పోలీసులు సవాల్ గా తీసుకున్నారు. నిజానిజాలు రాబట్టేందుకు విచారణ వేగవంతం చేశారు. బాధితురాలకి ఆశ్రయం ఇచ్చింది డాలర్ భాయే. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయించింది కూడా అతడే. ఈ కేసు విచారణలో డాలర్ భాయ్ కు సంబంధించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు డాలర్ భాయ్ ఎవరు? అతడికి సంబంధించిన ఆడియో టేపులు ఎందుకు సంచలనంగా మారాయి? అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

డాలర్ భాయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న మహిళే 4 నెలల క్రితం సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో డాలర్ భాయ్ పై ఫిర్యాదు చేసినట్టు పోలీసుల దృష్టికి వచ్చింది. ఆ కోణంలోనూ దర్యాఫ్తు చేస్తున్నారు. డాలర్ భాయ్ తనను ట్రాప్ చేశాడని, ప్రేమ పేరుతో మోసం చేశాడని, తన సర్టిఫికెట్లు కూడా అతడి దగ్గరే పెట్టుకున్నాడని బాధితురాలు తన ఫిర్యాదులో తెలిపింది. పంజాగుట్ట సోమాజిగూడ దగ్గర ఉన్న అమృత విల్లేలో 304లో ఒక కార్యాలయం సైతం నిర్వహిస్తున్నాడు. గాడ్ పవర్ పేరుతో స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేసి తనకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు.

దేశ చరిత్రలోనే తొలిసారిగా 139మందిపై నిర్భయ కేసు:
ఆగస్టు 21వ తేదీన 139 మంది అత్యాచారం చేశారంటూ మిర్యాలగూడకు చెందిన 25 ఏళ్ల యువతి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో మొత్తం 139 మందిపై పంజాగుట్ట పోలీసులు నిర్భయ చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే ఓ మహిళ ఇంత మందిపై ఫిర్యాదు చేయడం, 139 మందిపై నిర్భయ కేసు నమోదు కావడం దేశ చరిత్రలోనే ఇదే మొదటి సారి కావడం విశేషం. కాగా, 139 మందిపై ఆరోపణల్లో ఎవరు నిందితులు, ఎవరు భాదితులు అనే కోణంలో సీసీఎస్ పోలీసులు విచారణ చేస్తున్నారు.

బాధితురాలి పేరుతో డాలర్ భాయ్ బ్లాక్ మెయిల్:
9 సంవత్సరాలుగా రేప్ జరుగుతూ ఉంటే ఈ విషయం ఎందుకు బయటకు రాలేదనే ప్రశ్న ప్రధానంగా పోలీసులను వెంటాడుతోంది. ముఖ్యంగా ఈ వ్యవహారంలో కీలక పాత్రగా వ్యవహరించిన వ్యక్తి డాలర్ బాయ్ అలియాస్ కేఎస్‌ఆర్. ఇతని కోసం పోలీసులు తీవ్రంగా వెతుకుతున్నారు. బాధిత యువతిని కాపాడుతున్నట్లుగా నటిస్తూ ఆమెను లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ఇతనిపై ఉన్నాయి. బాధితురాలి పేరుతో డాలర్ బాయ్ బ్లాక్ మెయిల్‌కి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వ‌స్తున్నాయి.

దీంతో ఈ కేసులో డాల‌ర్ బాయ్ కీల‌కంగా మారాడు. డాల‌ర్ బాయ్ వ్య‌వ‌హారంపై సీసీఎస్ పోలీసులు నిఘా పెట్టారు. ఇప్పటికే భాదితురాలు స్టేట్ మెంట్ కూడా పోలీసులు రికార్డ్ చేశారు. తమ ప్రమేయం లేకపోయినా ఉద్దేశ పూర్వకంగా ఇరికించారని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.

నాకు ఎలాంటి సంబంధం లేదు-యాంకర్ ప్రదీప్
బాధితురాలి ఫిర్యాదుతో 139 మంది పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్‌లో చేర్చిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రముఖుల పేర్లు సైతం ఉండడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. చివరికి యాంకర్ ప్రదీప్ పేరు కూడా ఉండడంపై గురువారం(ఆగస్టు 27,2020) ఆయన స్వయంగా ఓ వీడియో విడుదల చేశారు. తనపై వస్తున్న ఆరోపణలను ప్రదీప్ తీవ్రంగా ఖండించారు. ఈ కేసుతో తనకేం సంబంధం లేదని స్పష్టం చేశారు. సున్నితమైన ఇలాంటి అంశంలో తన పేరు ఎందుకుందో కూడా ఆలోచించకుండా ఇష్టమొచ్చినట్టు రాసేస్తున్నారని మండిపడ్డారు. అవతలి వ్యక్తులు ఏ ఉద్దేశంతో ఈ ఆరోపణలు చేస్తున్నారో.. ఎవరు చేయిస్తున్నారో ఆలోచించకుండా వ్యక్తిగతంగా లక్ష్యంగా చేయడం ఎంతగానో బాధ కలిగిస్తోందని ప్రదీప్ ఆవేదన వ్యక్తం చేశారు.

తొమ్మిదేళ్లుగా ఎందుకు మౌనంగా ఉంది?
ఈ సంచలన కేసు వ్యవహారంలో కొన్ని ప్రశ్నలు పోలీసులను వేధిస్తున్నాయి. గత తొమ్మిదేళ్లుగా ఇంతలా ఘోరం జరుగుతుంటే ఆ విషయం ఇన్నాళ్లూ ఎందుకు వెలుగులోకి తీసుకురాలేదని పోలీసులు ప్రధానంగా అనుమానిస్తున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేసిన తర్వాత దీని విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాక, సీసీఎస్‌కు పోలీసులకు ఈ కేసును బదిలీ చేశారు.