గ్రామాల్లో 144 సెక్షన్: పంచాయితీ కార్యదర్శులకు కీలక ఆదేశాలు

  • Published By: vamsi ,Published On : March 21, 2020 / 01:15 AM IST
గ్రామాల్లో 144 సెక్షన్: పంచాయితీ కార్యదర్శులకు కీలక ఆదేశాలు

మెట్రో నగరాల నుంచి జిల్లా కేంద్రాలకు.. జిల్లా కేంద్రాల నుంచి పట్టణాలకు.. పట్టణాల నుంచి గ్రామాలకు.. కరోనా(కోవిడ్-19) అనుమానితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. అయితే మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు హర్షనీయం. కోవిడ్‌ వ్యాపిస్తున్న క్రమంలో ఇప్పటికే సినిమా హాళ్లు.. షాపింగ్ మాళ్లు.. జనాలు ఎక్కువగా కనిపించే ప్రతి ప్లేస్‌ను మూసివేయగా.. ఇప్పుడు గ్రామాల్లో కూడా నిషేధాజ్ఞలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. 

గ్రామాల్లో ఐదుగురు కంటే ఎక్కువమంది గుమికూడ వద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. 144 సెక్షన్‌ తరహాలో ఆంక్షలు అమలు చేయాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. కరోనా కేసుల సంఖ్య పెరిగిపోవడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. గ్రామాల్లో కొత్త వ్యక్తుల రాకపోకలపై నిఘా పెట్టి ఉంచాలంటూ పంచాయితీ కార్యదర్శులకు సూచనలు చేసింది. కొత్త వ్యక్తులు ఎవరొచ్చినా.. ఆ సమాచారాన్ని నమోదు చేసుకోవాలని, రోజువారీ నివేదికలను స్థానిక ఎంపీడీవో, తహసీల్దార్లకు సమర్పించాలని ఆదేశాలు జారీచేసింది.

See Also | తెలంగాణలో కరోనా : కేసీఆర్ కరీంనగర్ పర్యటన వాయిదా

విదేశాల నుంచి వచ్చిన వారిపై మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, వారు ఏ దేశం నుంచి, ఏ విమానంలో వచ్చారు.. ఎప్పుడు, ఎక్కడ దిగారు.. అక్కడి నుంచి గ్రామానికి చేరుకునేసరికి మార్గమధ్యలో ఎవరెవరిని కలిశారు అనే వివరాలను పక్కాగా సేకరించాలని సూచించారు. సదరు వ్యక్తులు దేశానికి చేరుకుని 14 రోజులు కాకపోతే స్వీయ క్వారంటైన్‌ వెళ్లేలా ఒత్తిడి చేయాలని కోరారు.

అలాగే జలుబు, దగ్గు, జ్వరం ఉన్నట్లు గుర్తిస్తే తక్షణమే ఆస్పత్రులకు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు ప్రభుత్వ కార్యాలయాలతో పాటు.. బ్యాంకులు, చిన్న చిన్న ఆఫీసులు, షాపుల ముందు  బకెట్‌ నీళ్లు, సబ్బు అందుబాటులో ఉంచాలని, శుభ్రంగా కాళ్లు, చేతులు కడుక్కుంటేనే ఆఫీసులోకి పంపించేలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచనలు చేసింది.