స్టేట్ టూర్ : తెలంగాణకు ఆర్థిక సంఘం బృందం

  • Published By: madhu ,Published On : February 3, 2019 / 01:13 AM IST
స్టేట్ టూర్ : తెలంగాణకు ఆర్థిక సంఘం బృందం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 15వ ఆర్థిక సంఘం మూడు రోజుల పర్యటన ఖరారు అయ్యింది. ఈనెల 18 నుంచి మూడు రోజులపాటు ఆర్థిక సంఘ బృందం పర్యటించనుంది. సీఎం కేసీఆర్‌తో పాటు ఆర్థికశాఖ అధికారులు, వివిధ రాజకీయ పార్టీలతోనూ ఆర్థికసంఘం భేటీ కానుంది. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, వాటికి నిధుల కేటాయింపు తదితర అంశాలపై ఆరా తీయనుంది. 

తెలంగాణలో పర్యటించనున్న 15వ ఫైనాన్స్‌ కమిషన్‌
ఈనెల 18 నుంచి 20 వరకు పర్యటన
సంక్షేమ పథకాల అమలు, నిధుల కేటాయింపుపై ఆరా
సాగునీటి ప్రాజెక్టుల పనులను పరిశీలించనున్న బృందం

15వ ఫైనాన్స్‌ కమిషన్‌ తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజులపాటు పర్యటించనుంది. ఈనెల 18 నుంచి 20 వరకు రాష్ట్రంలో పర్యటన కొనసాగనుంది. తెలంగాణలో అమలవుతోన్న సంక్షేమ పథకాలు, వాటికి నిధుల కేటాయింపులాంటి అంశాలపై వివరాలు సేకరించనుంది. ప్రముఖ ఆర్థిక నిపుణుడు ఎన్‌కె సింగ్‌ నేతృత్వంలోని బృందం సాగునీటి ప్రాజెక్టుల పనులు నడుస్తున్న ప్రాంతాలను కూడా సందర్శించనుంది.  కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతలతోపాటు వివిధ గ్రామాలకు కూడా ఈ బృందం వెళ్లనుంది. మొదటి రెండు రోజులు హైదరాబాద్‌లో ఉండే ఆర్థిక సంఘం,  ముఖ్యమంత్రితో భేటీకానుంది. ఆర్థిక సంఘం రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో  ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రం నుంచి డిమాండ్లను, ప్రతిపాదనలను స్వీకరిస్తుంది. వివిధ పార్టీలతోపాటు వివిధ సంఘాలతోనూ ఆర్థికసంఘం సమావేశమవుతోంది.

మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పనులను పరిశీలించనున్న ఆర్థికసంఘం
అక్టోబర్‌ 30లోగా నివేదికను సమర్పించనున్న ఫైనాన్స్‌ కమిషన్‌

ఆర్థికవేత్త ఎన్‌కె సింగ్‌ నేతృత్వంలోని ఆర్థికసంఘం…మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పనులను పరిశీలించనుంది. పర్యటన సందర్భంగా వచ్చిన డిమాండ్లు, ప్రతిపాదనలతో కూడిన నివేదికను ఈ ఏడాది అక్టోబర్‌ 30వ తేదీలోపు అందజేయాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ 2020 నుంచి ఈ నివేదికలోని అంశాలను అమలు చేయాల్సి ఉంటుంది. 

ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం
ఆర్థిక సంఘానికి ఇచ్చే నివేదికపై  దృస్టి సారించిన సర్కార్‌
ఆర్థికసంఘం పర్యటన తర్వాతే బడ్జెట్‌ సమావేశాలు

కేంద్ర ప్రభుత్వం ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓట్‌ ఆన్ అకౌంట్‌ బడ్జెట్‌నే ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. మరోవైపు 15వ ఆర్థిక సంఘానికి అందించే నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ఆర్థిక సంఘం పర్యటన తర్వాతే తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్‌ అయినట్టు తెలుస్తోంది.