తెలంగాణ స్త్రీ శక్తులు మంగ్లీ,ఇస్మార్ట్ గంగవ్వలు: అవార్డులు ప్రకటించిన ప్రభుత్వం

  • Published By: veegamteam ,Published On : March 7, 2020 / 10:14 AM IST
తెలంగాణ స్త్రీ శక్తులు మంగ్లీ,ఇస్మార్ట్ గంగవ్వలు: అవార్డులు ప్రకటించిన ప్రభుత్వం

మార్చి-8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించిన మహిళలకు అవార్డులను ప్రకటించి సత్కరిస్తుంది. మహిళల సేవలను..ప్రతిభాపాటవాలను గుర్తించి ఇచ్చే మార్చి-8 2020 అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంవత్సరం 30 మంది ప్రముఖ మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. 20 రంగాల్లో 30 మంది మహిళలకు అవార్డులు ప్రకటించింది ప్రభుత్వం.  అవార్డులకు ఎంపికైన వారిలో వ్యవసాయం, సామాజిక సేవ, వ్యాపార, జర్నలిజం, నృత్యం, పెయింటింగ్‌, విద్య, వైద్య, జానపదం,  క్రీడా, సాహిత్యం, నాట్యం, సంగీతం తదితర రంగాలకు చెందిన మహిళలు ఉన్నారు.  

జానపద కళారంగంలో మంగ్లీ సత్యవతి, సోషల్‌ మీడియాలో మిల్కూరి గంగవ్వ, వ్యవసాయ రంగంలో బెగారి లక్ష్మమ్మ, జర్నలిజంలో జీ నిర్మల రెడ్డి తో పాటు మరికొందరు అవార్డుకు ఎంపికయ్యారు. ఇటీవల వెయిట్‌ లిఫ్టింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన దీక్షిత, స్విమ్మింగ్‌లో స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసిన శ్యామల గోలీలతో పాటు మొత్తం 30మంది మహిళలు  మహిళా స్త్రీశక్తి అవార్డులకు ఎంపికయ్యారు. ఎంపికైన 30 మంది మహిళలకు ప్రభుత్వం మార్చి 8(అంతర్జాతీయ మహిళా దినోత్సవం)న రూ. 1 లక్ష నగదు రివార్డుతో సత్కరించనుంది.

స్త్రీశక్తి  ‘మాటకారి మంగ్లీ’
తన పాటలతో తెలుగు రాష్ట్రాల ప్రజల మనసులు దోచుకున్న మంగ్లీ సత్యవతి..గాయనిగా, బుల్లితెర యాంకర్‌గా, నటిగా ఆమె ప్రతిభ గురించి ప్రత్యేకించి చెప్పుకోనక్కరలేదు. ‘మాటకారి మంగ్లీ’ ప్రోగ్రామ్‌ ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించిన ఆమె పలు చిత్రాల్లో పాటలు పాడారు. మంగ్లీ నాన్న బాలు నాయక్‌ జానపద కళాకారుడు. పాటలు పాడే తండ్రిని చూస్తూ పెరిగిన మంగ్లీకి కూడా పాటలంటే ప్రాణంలా పెరిగింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం,  ఉగాది, వినాయక చవితి, బతుకమ్మ, బోనాలు, సమ్మక్క-సారక్క జాతరల సందర్భంగా ఆమె పాటలు పాడి ఎంతో గుర్తింపు తెచ్చుకుంది మాటకారి మంగ్లీ. బతుకమ్మ పండుగ వస్తోదంటే చాలా మంగ్లీ పాట కోసం ప్రజలు ఎదురు చూస్తారు. అది ఆ ప్రత్యేకత.

‘ఇస్మార్ట్‌ లోకల్‌’ గంగవ్వ టాలెంట్ కు ఫిదా
యూట్యూబ్‌ సంచలనం గంగవ్వ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అచ్చమైన తెలంగాణ భాష, యాస, అమాయకమైన చూపులు, లోకల్‌ పంచ్‌లతో ప్రజల మనసులకు గెలుచుకుంది గంగవ్వ. ‘మై విలేజ్‌ షో’ యూట్యూబ్‌ ఛానెల్‌లో గంగవ్వ పాత్రలో ఆమె నటన అద్భుతం. పల్లెటూరి సంస్కృతిని చాటి చెబుతూ ప్రజాదరణ పొందడంతో సినిమాల్లోకి రంగం ప్రవేశం చేశారు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్‌ శంకర్‌, మల్లేశం చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె. గంగవ్వది.. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని లంబాడిపల్లి గ్రామంలో పుట్టింది ఈ ‘ఇస్మార్ట్‌ లోకల్‌’ గంగవ్వ.ఆమె టాలెంట్ కు ప్రజలు ఫిదా అయిపోయారు. 

See Also | PhonePe యూజర్లకు UPI కష్టాలు.. 40% మందికి పనిచేయడం లేదు!