జనగామ ఎంసీహెచ్‌ రికార్డ్ : 24గంటల్లో 22 డెలివరీలు

  • Published By: veegamteam ,Published On : September 21, 2019 / 08:57 AM IST
జనగామ ఎంసీహెచ్‌ రికార్డ్ : 24గంటల్లో 22 డెలివరీలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్భిణులకు ఇస్తున్న కేసీఆర్‌ కిట్‌ పథకంతో గవర్నమెంట్ హాస్పిటల్స్ లో డెలివరీలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో జనగామ మాతా శిశు ఆరోగ్యం కేంద్రం (ఎంసీహెచ్‌) రికార్డ్ సృష్టించింది. కేవలం 24గంటల్లో 17 నార్మల్ డెలివరీలు, ఐదు సిజేరియన్లు చేసి రాష్ట్ర స్థాయిలోనే తొలి రికార్డును సొంతం చేసుకుంది.  

గురువారం (సెప్టెంబర్ 19) ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం అంటే 20 తేదీ ఉదయం 9 గంటల వరకు  మొత్తం 22 డెలివరీలు చేశారు. వీటిలో కేవలం ఐదు మాత్రమే సిజేరియన్‌ ఉండగా..మిగతా 17 నార్మల్ డెలివరీలు కావటం విశేషం. ఎంసీహెచ్ సాధించిన ఈ ఘనతకు ఉన్నతాధికారులు ప్రశంసించారు.ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. 

సిజేరియన్లు అవసరం మేరకే తప్ప అన్ని కేసుల్లోను చేయకూడదనీ..నార్మల్ డెలివరీలని ప్రోత్సహించాలని ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గర్భిణులకు నార్మల్ డెలివరీలపై డాక్టర్లు అవగాహన కల్పిస్తు..నార్మల్ డెలివరీలు చేస్తున్నారు. దీంట్లో భాగంగానే 24 గంటల్లో 22 డెలివరీలు చేసి రికార్డు సృష్టించారు. ఈ 22 నార్మల్ డెలివరీలు..సిజేరియన్లలో తల్లీ బిడ్డలకు క్షేమంగా ఉన్నారని సీనియర్ డాక్టర్ తెలిపారు. ఇటువంటి అద్భుతమైన సేవల్ని ప్రజలకు అందించిన డాక్టర్లు, నర్సులను హాస్పిటల్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎం  కేసీఆర్‌ పేరుతో  కిట్లు,  మౌలిక వసతులు వంటి పలు దిద్దుబాటు చర్యలతో కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందిస్తుండటంతో గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఓపీ,డెలివరీ సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. డెలివరీలు చేసే డాక్టర్లకు ప్రతీ మూడు నెలలకు ఒకసారి టెక్నాలజీకి అనుగుణంగా ట్రైనింగ్ ఇస్తుండటం..గర్భిణులకు సాధారణ ఎక్సర్ సైజులు, పౌష్టికాహరంపై అవగాహన కల్పిస్తున్నారు సీనియర్ డాక్టర్లు. దీంతో ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్స్ కు రావటం పెరుగుతోందంటున్నారు అధికారులు.