శంషాబాద్ ఎయిర్ పోర్టు బాత్ రూంలో బంగారు బిస్కెట్లు

  • Published By: madhu ,Published On : August 26, 2019 / 01:36 AM IST
శంషాబాద్ ఎయిర్ పోర్టు బాత్ రూంలో బంగారు బిస్కెట్లు

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అక్రమార్కులకు అడ్డగా మారిపోయింది. విదేశాల నుంచి బంగారం, ఇతరత్రా విలువైన సామాగ్రీని తరలిస్తున్నారు. అధికారుల నుంచి తప్పించుకోవడానికి ఎత్తులు వేస్తున్నారు. కానీ తనిఖీల్లో దొరికి పోతున్నారు. ప్రధానంగా బంగారాన్ని తరలిస్తూ ఎంతో మంది దొరికిపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి నుంచి భారీగా బంగారు బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

షార్జా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద కోటి 11 లక్షల విలువైన బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి హైదరాబాద్‌ వస్తున్న షేక్‌ అబ్దుల్‌ సాజిద్‌ అనే ప్రయాణికుడు అక్రమంగా బంగారం తరలిస్తున్నాడనే సమాచారంతో కస్టమ్స్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. అధికారులు తనిఖీలు చేస్తున్నారనే విషయాన్ని సాజిద్ గ్రహించాడు. వెంటనే తాను తీసుకొచ్చిన బంగారాన్ని ఎయిర్ పోర్టులోని మరుగుదొడ్డిలో పడేశాడు.

కాగా సాజిద్‌ను తనిఖీ చేసిన కస్టమ్స్‌ అధికారులకు అతని వద్ద ఎలాంటి బంగారం లభించలేదు. దీంతో అదుపులోకి తీసుకొని విచారించగా వాష్‌రూమ్‌లో పడేసిన విషయాన్ని అధికారులకు చెప్పాడు. దీంతో బాత్‌రూంలో ఉన్న 2.99 కిలోల బరువున్న 26 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. 
Read More : ప్రింట్ మీడియాపైనే నమ్మకం ఎక్కువ…ఎందుకంటే