హైదరాబాద్ కు పశ్చిమంగా 50 కి.మీ . దూరంలో వాయుగుండం

  • Published By: murthy ,Published On : October 14, 2020 / 01:03 PM IST
హైదరాబాద్ కు పశ్చిమంగా 50 కి.మీ . దూరంలో వాయుగుండం

hyderabad:భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న హైదరాబాద్‌ ప్రజలకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ  చేసింది. నగరానికి పశ్చిమంగా 50 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నట్టు అధికారులు తెలిపారు. రాగల 12 గంటల్లో ఇది తీవ్ర అల్పపీడనంగా బలహీన పడుతుందని అన్నారు. దీని ప్రభావంతో బుధవారం తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.




ఇక, నిన్నటి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు హైదరాబాద్ వాసులను తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగగా, పలు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లపైకి నడుములోతు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలాప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. నగరంలో మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని, అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు.

రానున్న రెండు రోజుల్లో తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. ఈ సమయంలో లోతట్టు, వరద ముప్పు ఉన్న ప్రాంతాల పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం ఉంటే తప్ప ఎవరూ బయటకు వెళ్లవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు..




ఇలాంటి క్లిష్ట సమయాల్లో అధికారులు, సిబ్బందితో కలిసి సహాయ చర్యల్లో పాల్గొనటానికి స్వచ్ఛంద సేవకులు, వాలంటీర్లు, పౌరులు ముందుకు రావాలని కోరారు. తాను కూడా వ్యక్తిగతంగా ఎన్డీఆర్‌ఎఫ్‌ డీజీతో మాట్లాడి సహాయ బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించినట్లు చెప్పారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ అంతటా సహాయ కార్యక్రమాల కోసం మరో రెండు బృందాలు ఈ రాత్రికి విజయవాడ నుండి హైదరాబాద్ చేరుకోనున్నాయని చెప్పారు.

ప్రతి ఒక్కరూ ఇంటిలోనే ఉండి ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే అధికారులను సంప్రదించాలని కిషన్‌రెడ్డి సూచించారు. అవసరమైతే స్థానిక దళాలకు సహాయం చేయడానికి సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్పీఎఫ్‌ తదితర పారామిలిటరీ దళాలను తీసుకు రావడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.