7ఎయిర్ పోర్ట్ లలో హై అలర్ట్…ఆ దేశం నుంచి వచ్చేవాళ్లను పూర్తిగా స్కాన్ చేయాల్సిందే

  • Published By: venkaiahnaidu ,Published On : January 21, 2020 / 02:32 PM IST
7ఎయిర్ పోర్ట్ లలో హై అలర్ట్…ఆ దేశం నుంచి వచ్చేవాళ్లను పూర్తిగా స్కాన్ చేయాల్సిందే

చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచదేశాలను భయపెడుతోంది. ఇప్పటివరకు పదుల సంఖ్యలో ప్రజలు వుహాన్‌ నగరంలో ఈ వైరస్‌ బారిన పడగా, నేటికి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యాధి తమ దేశ ప్రజలకు సోకకుండా ఆయా దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి. భారత్ కూడా ఈ వైరస్ దేశంలోకి ప్రవేశించకుండా తగు చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా చైనా నుంచి వచ్చే ప్యాసింజర్లను స్క్రీన్ చేయాలని,వాళ్లు వైరస్ బారిన పడలేదని తెలిసిన తర్వాతనే వాళ్లను బయటకు పంపాలని దేశంలోని ఏడు విమానాశ్రయాలకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

 చైనా,హాంకాంగ్ నుంచి  కూడా వచ్చే ప్యాసింజర్లందరినీ స్క్రీన్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని పౌరవిమానయాన శాఖ చెన్నై,హైదరాబాద్,కొచ్చిన్,బెంగళూరు ఎయిర్ పోర్ట్ లు కు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఢిల్లీ,ముంబై,కోల్ కతా ఎయిర్ పోర్ట్ లకు ఈ మేరకు పౌరవిమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. వెంటనే ఏడు ఎయిర్ పోర్ట్ లు స్కానింగ్ ప్రక్రియను అమలు చేయాలని ఆదేశించారు. మొత్తం ఏడు విమానాశ్రయాలు మరియు అన్నిసంబంధిత విమానయాన సంస్థలు ఖచ్చితంగా పాటించాల్సిన వివరణాత్మక కార్యాచరణ ప్రణాళికను మంత్రిత్వ శాఖ రూపొందించింది.

మరోవైపు ఈ ప్రాణాంతకమైన వైరస్ ఇప్పటికే థాయ్ లాండ్,జపాన్,దక్షిణ కొరియాలకు పాకింది. చైనాలో ఈ వైరస్ బారిన పడినవారి సంఖ్య 300కి చేరింది. ఇటీవల చైనాలోని ఓ భారతీయ టీచర్ కి కూడా ఈ వైరస్ సోకింది. ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. గతవారం భారత్ కూడా చైనా పర్యటనకు వెళ్లే భారతీయులను దీనిపై అలర్ట్ చేసింది. డిసెంబర్ 31,2019 నుంచి భారత వీసా కోసం దరఖాస్తు చేసుకున్నవారి వివరాలు ఇవ్వాలని ఆరోగ్యశాఖ విదేశీ మంత్రిత్వ శాఖను కోరింది.

ఈ వైరస్‌.. ప్రమాదకరమైన సార్స్ వైరస్‌ను పోలి ఉండటంతో కలకలం రేగింది. 2003లో సార్స్ వైరస్ విజృంభించడంతో చైనా, హాంగ్‌కాంగ్‌లలో 650 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి ఎలా వ్యాపిస్తుందనే విషయంపై స్పష్టత కొరవడటంతో ప్రస్తుతం చైనా వణికిపోతోంది. ఈ వైరస్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలకు ఇప్పటికే పిలుపునిచ్చింది.