రోడ్లు కిటకిట : తెలంగాణలో 75లక్షలు దాటిన వాహనాల సంఖ్య

  • Published By: veegamteam ,Published On : February 18, 2019 / 04:45 AM IST
రోడ్లు కిటకిట : తెలంగాణలో 75లక్షలు దాటిన వాహనాల సంఖ్య

తెలంగాణ రాష్ట్రంలో వాహనాలు వెల్లువెత్తున్నాయి. రహదారులు కిటకిటలాడుతున్నాయి. ఐదేళ్లలో 8.16 రెట్లకు మించి పెరిగాయి. రాష్ట్ర జనాభాలో ప్రతి 5.92 మందికి ఒక వాహనం ఉన్నట్లుగా రవాణాశాఖ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ప్రభుత్వం పెద్ద సంఖ్యలో వాహనాలు కొనుగోలు చేసింది. ప్రత్యేకించి పోలీసు శాఖకు భారీగా వాహనాలను సమకూర్చింది. వాహనాల పెరుగుదల తీరు అధికారులకు సైతం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వాహనాల విస్పోటనంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా సైతం గలగలలాడుతోంది. రవాణా శాఖ వాహనాల రిజిస్ట్రేషన్‌ కోసం రూపొందించిన 11 విభాగాల్లోనూ 2014 జూన్‌ నుంచి 2018 డిసెంబర్ వరకు 200 శాతానికి పైగా పెరుగుదల నమోదు కావటం రికార్డే.

వాహనాలు పెరుగుతున్నయి గానీ ఆ స్థాయిలో రహదారుల వెడల్పు పెరగటం లేదు. ఉబర్‌, ఓలా సంస్థలు ప్రవేశించటంతో మోటార్‌ క్యాబులు (ట్యాక్సీ కార్లు) కూడా భారీగా పెరిగాయి. మొత్తం 75.57 లక్షల వాహనాల్లో  ద్విచక్ర వాహనాల వాటా 65 %
 
ఖరీదైన కార్ల జోరు:
రాష్ట్రంలో ఖరీదైన కార్ల సంఖ్య ఇటీవలి కాలంలో భారీగా పెరుగుతోంది. కొత్తగా వచ్చిన అత్యంత ఖరీదైన ఎలాంటి వాహనమైనా హైదరాబాద్‌ రోడ్లపై తిరగాల్సిందేనని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. రూ. 50 లక్షల నుంచి రూ. కోటి విలువ చేసే కార్లు ఏటా 200 నుంచి 300 వరకు పెరుగుతున్నాయి.

* రూ. కోటి.. అంతకుమించి విలువైన కార్లు ఏటా వందకుపైగా రిజిస్ట్రేషన్‌ అవుతున్నాయి. కొన్ని రకాల ద్విచక్రాల వాహనాలు కూడా ఖరీదైనవే రోడ్లపైకి వస్తున్నాయి. ఖరీదైన వాహనాల్లో 75 నుంచి 80 శాతం వరకు హైదరాబాద్‌ నగరంలోనే రిజిస్టర్‌ అవుతున్నాయి.

   సంవత్సరం  రూ.50 లక్షల నుంచి రూ.కోటి      రూ.కోటి అంతకు మించి 
    2014               160                   43
    2015               362                   61
    2016               564                  125
    2017               866                  125
    2018             1,148                  127

 

* ప్రస్తుతం రాష్ట్రంలోని మొత్తం వాహనాలు   75,57,717.

* రాష్ట్రంలోని మొత్తం ద్విచక్ర వాహనాలు 48,94,084 లక్షలు.

* వ్యక్తిగత కార్లు 2014తో పోలిస్తే ఇప్పటికి రెండున్నర రెట్లు పెరిగాయి. అప్పుడు 1.78 లక్షల కార్లు ఉంటే, ప్రస్తుతం17.40 లక్షలకు చేరాయి.