కొలువులో చేరిన రెండు నెలలకే.. అవినీతి చేసి ఏసీబీకి చిక్కిన వీఆర్ఓ

  • Published By: vamsi ,Published On : October 4, 2019 / 03:31 AM IST
కొలువులో చేరిన రెండు నెలలకే.. అవినీతి చేసి ఏసీబీకి చిక్కిన వీఆర్ఓ

ఉద్యోగం వచ్చేవరకు ఉద్యోగం రాలేదని బాధ.. ఉద్యోగం వచ్చిన తర్వాత మాత్రం అవినీతి చేసి దొరికేస్తున్నారు కొందరు. కొత్తతరం వస్తుంది. ఈ అవినీతి నుంచి సమాజం బయటపడుతుందేమో అని ఆలోచించేవారిని బాధపెట్టే సంఘటనే ఇది.

అవును ఉద్యోగంలో చేరి సరిగ్గా రెండు నెలలు కాలేదు. అసలు ఏమేమి ఫైళ్లు ఉన్నాయో కూడా సరిగ్గా చూసి ఉండని ఓ వీఆర్ఓ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ)కి చిక్కాడు.

వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తుర్కయంజాల్‌ మున్సిపాలిటీ పరిధి కమ్మగూడ వీఆర్ఓ ఆఫీసులో పనిచేసే శంకర్ ఉద్యోగంలో చేరి రెండు నెలలైంది. అయితే అప్పుడే అవినీతికి అలవాటు పడిపోయాడు.

గుర్రంగూడ గ్రామానికి చెందిన ముత్యంరెడ్డి అనే రైతు తనకు చెందిన ఎకరా ఇరవై సెంట్లను(1.20) భూమి మ్యూటేషన్‌ చేయించుకునేందుకు వీఆర్ఓ శంకర్‌ను కలవగా.. అతడు రైతును రూ. లక్ష లంచం డిమాండ్ చేశాడు. డబ్బిస్తేనే పని అవుతుందని అన్నాడు.

దీంతో లక్ష ఇవ్వలేనని, రూ. 70 వేలు ఇస్తానని ఒప్పుకున్నాడు. అనంతరం, రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం రైతు ముత్యం రెడ్డి వీఆర్ఓకు రూ.50వేలు డబ్బు ఇస్తుండగా ఏసీబీ అధికారులు అతడిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

అనంతరం నిందితుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించారు అధికారులు. ఏ స్థాయి అధికారి అయినా రాష్ట్రంలో లంచం డిమాండ్‌ చేస్తే తమను ఆశ్రయించాలని ఏసీబీ అధికారులు సూచించారు. 9440446140 నంబరుకు ఫోన్‌ చేయాలని కోరారు.