కొత్త TPCC CHIEF ఎవరు : నగరానికి రానున్న మాణిక్ ఠాగూర్

  • Published By: madhu ,Published On : December 9, 2020 / 07:07 AM IST
కొత్త TPCC CHIEF ఎవరు : నగరానికి రానున్న మాణిక్ ఠాగూర్

Manickam Tagore Visit Hyderabad : GHMC ఎన్నికలు తెలంగాణ రాజకీయాలను మార్చేశాయి. ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌ (Telangana Pradesh Congress Committee) తన పదవికి రాజీనామా చేసేశారు. దీంతో మరి తర్వాతి టీపీసీసీ చీఫ్‌ ఎవరు..? అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతోంది..? పార్టీ పగ్గాలు ఎవరికి ఇవ్వనుంది. తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రాజీనామా చేయడంతో.. కొత్త పీసీసీ చీఫ్ వేట మొదలు పెట్టింది అధిష్టానం. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత పదవికి రాజీనామా చేస్తూ ఉత్తమ్ రాసిన లేఖ అధిష్టానికి చేరింది. దీంతో.. కొత్త రథసారధిని వెతికె పనిలో పడింది అధిష్టానం. రాష్ట్ర నేతలతో సమాలోచనలు చేయాలని ఏఐసీసీ ఇంచార్జ్‌కి పార్టీ అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది. దీని కోసం 2020, డిసెంబర్ 09వ తేదీ బుధవారం హైదరాబాద్‌కు రానున్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ ఠాగూర్. ఇక గురువారం నుంచి రాష్ట్ర పార్టీ నేతలతో సంప్రదింపులు చేయనున్నారు.



రెండు రోజుల పాటు పర్యటన :-
రాష్ట్రంలో అన్ని స్థాయిలలోని పార్టీ నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేయాలనే యోచనలో మాణిక్ ఠాగూర్‌ ఉన్నట్టుగా తెలుస్తోంది. రెండు రోజుల పాటు రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నేతలతో సంప్రదింపులు జరపనున్నారు.. ఎలాంటి వివాదాలు రాకుండా మెజారిటీ నేతల అభిప్రాయానికి ఆమోదం తెలపాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టుగా సమాచారం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, ముఖ్య నాయకులతో విడివిడిగా సమావేశం నిర్వహిస్తారు. నేతల అభిప్రాయాల నివేదికను సోనియా, రాహుల్ గాంధీకి ఠాగూర్ స్వయంగా ఇవ్వనున్నారు.



అభిప్రాయ సేకరణలో ఏం తేలనుంది :-
కొత్త పీసీసీ అధ్యక్ష ఎన్నికపై అందరి నేతల అభిప్రాయం తీసుకుంటారని టీపీసీసీ తాత్కాలిక అధ్యక్షుడు ఉత్తమ్ స్పష్టం చేశారు. మెజార్టీ సభ్యుల అభిప్రాయం మేరకే కొత్త పీసీసీ ఎంపిక ఉంటుందన్నారాయన. ఉత్తమ్ రాజీనామాతో.. పలువురు నేతల పేర్లు తెరపైకి వచ్చాయి… నేను రేస్‌లో ఉన్నానంటే.. తానూ కూడా అర్హుడిని అంటూ కొందరు నేతలు పీసీసీపై స్టేట్‌మెంట్లు ఇస్తూ వస్తున్నారు. మరి అభిప్రాయ సేకరణలో ఏం తేలనుంది.. కొత్త పీసీసీ చీఫ్ ఎవరు..? అధిష్టానం ఎవరికి అవకాశం ఇవ్వనుంది అనేది మాత్రం మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.