బాబోయ్ మెట్రో స్టేషన్లు : ప్రాణాలు తీస్తున్నాయ్

  • Published By: veegamteam ,Published On : September 23, 2019 / 03:50 AM IST
బాబోయ్ మెట్రో స్టేషన్లు : ప్రాణాలు తీస్తున్నాయ్

మెట్రో రవాణా భద్రతకు పేరుగా భావించిన ప్రయాణికుల్లో ఆందోళన, అనుమానం మొదలైంది. మెట్రో ఇన్నాళ్లూ సాంకేతిక లోపాలతో ఇబ్బంది పెట్టగా ఇప్పుడు నిర్మాణ లోపాలతో భయపెడుతోంది. పలు చోట్ల వయాడక్ట్ నుంచి సిమెంట్ పెచ్చులు ఊడిపతున్నాయి. మెట్రో స్టేషన్లలో గోడలకు బీటలు రాగా, మరుగుదొడ్ల మురుగు రోడ్లపైకి వస్తోంది. ప్రారంభించి రెండేళ్లు కాకుండానే మెట్రో ఒకరిని బలి తీసుకోవడం నగరవాసులకు ఆందోళనకు గురి చేసింది. ఆదివారం (సెప్టెంబర్ 22, 2019) అమీర్ పేట మెట్రో స్టేషన్ కింద నిల్చున్న వివాహిత మౌనిక పై సిమెంట్ పెచ్చులు ఊడి పడటంతో ఆమె మృతి చెందారు. 

వానాకాల ప్రారంభంలో అమీర్ పేట స్టేషన్ లోనే పెద్ద ప్రమాదం తప్పింది. గాలివానకు రెండో అంతస్తులో పైకప్పుకు ఉన్న ఫాల్స్ సీలింగ్ ఊడి చెల్లాచెదురుగా పడింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. అమీర్ పేట నుంచి అనునిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఎస్కలేటర్ల నుంచి ఎక్కువగా పై అంతస్తులకు చేరుకుంటారు. ఎస్కలేటర్లకు ఎలాంటి రక్షణ లేదు. పిల్లలు చేజారితే ప్రాణాలు కోల్పోవడం ఖాయం. దీనిపై ఇప్పటికే ఫిర్యాదు చేసినా నిర్వాహకులు పట్టించుకోవడం లేదు.

ఏడాది క్రితం ప్రారంభమైన అమీర్ పేట-ఎల్ బీనగర్ మెట్రో మార్గంలో మొజంజాహి మార్కెట్ కూడలిలోని వయాడక్ట్ పెచ్చులు ఊడిపడుతున్నాయి. నిర్వహణపై ఎల్ ఆండ్ టీ మెట్రో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇటీవల అసెంబ్లీ మెట్రో స్టేషన్ లో పిడుగుల నుంచి రక్షణగా ఏర్పాటు చేసిన ఇనుపకడ్డీ ఊడి ఏకంగా మెట్రో పట్టాలపైనే పడింది. తృటితో ప్రమాదం తప్పింది.

2017మార్చి నెలలో నాంపల్లిలో స్టేషన్ నిర్మాణ పనులు జరుగుతుండగా ఆ మార్గంలో వెళ్తున్న మహిళా ఉజ్మా హాఫిజ్ తలపై వయాడక్ట్ కు ఉన్న 232 ఎంఎం రంధ్రంలో నుంచి ఇనుపకడ్డీ పడి తీవ్రగాయాలపాలైంది. 2018 జనవరి నెలలో మలక్ పేటలో మెట్రో రైలు స్టేషన్ నిర్మాణంలో ఉండగా ఇనుపకడ్డీ జారీ కింద వెళ్తున్న కారు బానెట్ లోకి దిగింది. 2018 ఫిబ్రవరి నెలలో హైటెక్ సిటీ వెల్డింగ్ పనులు చేస్తుండగా నిప్పు రవ్వలు పడి మంటలంటుకున్నాయి. 2014లో మెట్రో స్తంభాల కోసం తవ్విన పునాదుల్లో అర్ధరాత్రి సిమెంట్ లారీ పడటంతో అక్కడ పని చేస్తున్న ఇద్దరు కూలీలు మృతి చెందారు.