ప్రజారవాణా బంద్: నిర్మానుష్యంగా రోడ్లు

  • Published By: vamsi ,Published On : March 22, 2020 / 01:46 AM IST
ప్రజారవాణా బంద్: నిర్మానుష్యంగా రోడ్లు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కత్తులు దూస్తుంది. మన దేశంలో కూడా ఇప్పటికే బాధితుల సంఖ్య మూడొందలు దాటేసింది. ఈ క్రమంలోనే కరోనా విస్తరణకు అడ్డుకట్ట వేయడానికి ఆదివారం(22 మార్చి 2020) జనతా కర్ఫ్యూకు ప్రధాని మోడి పిలుపు ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కూడా ప్రజారవాణాను నిలిపివేయాలంటూ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ప్రజారవాణ బంద్ అయ్యింది. దీంతో హైదరాబాద్ నగరంలో రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. 

గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రైవేటు వాహనాలు కూడా స్వచ్చందంగా బంద్‌లో పాల్గొంటున్నాయి. మెట్రోరైలుతో పాటు ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్‌ రైళ్లు, క్యాబ్‌లు, ఆటోలు నిలిపివేశారు. జనతాకర్ఫ్యూలో భాగంగా తెలంగాణలో ఇవాళ ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఆదేశాలు అమల్లో ఉండగా.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల ప్రకారం ప్రతీ రవాణావిభాగం ఆదేశాలను అమలు చేస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం దక్షిణమధ్య రైల్వే ఆధ్వర్యంలో నడుస్తున్న 12 ఎంఎంటీఎస్‌ సర్వీసులు మినహా మిగతా సర్వీసులను రద్దుచేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ కూడా మెట్రోరైళ్లను పూర్తిస్థాయిలో రద్దు చేసింది. ముఖ్యమంత్రి చెప్పినట్లుగా 5 రైళ్లను మాత్రం ఎమర్జెన్సీ అవసరాల కోసం టెర్మినల్స్‌ వద్ద అందుబాటులో ఉంచారు అధికారులు. నాగోల్‌, ఎల్బీనగర్‌, ఎంజీబీఎస్‌, రాయదుర్గ్‌, అమీర్‌పేట వద్ద అందుబాటులో ఉంచారు.

ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే సిద్ధంగా ఉన్న రైళ్లను ఆపరేట్‌ చేస్తారు. 5 రైళ్లు ప్రయాణికుల కోసం ఆపరేట్‌ చేయబోమని, కేవలం ముందుజాగ్రత్త కోసమే అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. అదేవిధంగా ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 29 డిపోలకు చెందిన 2,800 బస్సులు రోడ్డెక్కవు. నగర ప్రయాణికును గమ్యస్థానాలకు చేర్చే  121 ఎంఎంటీఎస్‌ రైళ్లలో 12 మాత్రం ఎమర్జెన్సీ సర్వీసుల కోసం నడిపిస్తున్నారు.