అంబరాన్నంటిన సంబరం : తెలుగు రాష్ట్రాల్లో ”భోగి” ఉత్సవం

  • Published By: veegamteam ,Published On : January 14, 2019 / 02:39 AM IST
అంబరాన్నంటిన సంబరం : తెలుగు రాష్ట్రాల్లో ”భోగి” ఉత్సవం

తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ సందడి నెలకొంది. ప్రజలంతా ఆనందంగా పండుగను జరుపుకుంటున్నారు. తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేశారు. చిన్న, పెద్ద భోగిమంటల చుట్టూరా చేరి  ఆడి పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. సంక్రాంతి ముందురోజు వచ్చే భోగిని ఘనంగా జరుపుకుంటున్నారు. అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని పాటిస్తూ ఊరూవాడ భోగి మంటలు వేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.

ప్రకాశం, నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రజలు భోగి పండుగను  వైభవోపేతంగా జరుపుకుంటున్నారు. బంధువులతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారితో ఘనంగా పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తెల్లవారుజామునే ప్రతి ఇంటి ముందు భోగి మంటలు వేశారు. వాటి చుట్టూరా చేరి ఆడిపాడుతున్నారు. భోగ భాగ్యాలు ఇచ్చే భోగికి ఘనంగా స్వాగతం పలికారు.

తూర్పుగోదావరి జిల్లాలో ఘనంగా భోగి సంబరాలు మొదలయ్యాయి. వాడవాడలో భోగి మంటలు వెలుగుతున్నాయి. భోగ భాగ్యాల భోగీని ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. కాకినాడ నగరంలో అంబరాన్నంటే రీతిలో భోగి సంబరాలు షురూ అయ్యాయి.

సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారి పల్లెలో భోగి వేడుకలు అంబరాన్నంటాయి. ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా నారావారి పల్లెలో భోగి వేడుకలు జరుపుకుంటున్నారు. 2019, జనవరి 13వ తేదీ ఆధివారం రోజే సీఎం కుటుంబ సభ్యులంతా నారావారి పల్లెకు చేరుకున్నారు. తెల్లవారుజాము నుంచే భోగిమంటలు వేసి దాని చుట్టూ తిరుగుతూ సందడి చేశారు. మంత్రి నారా లోకేష్‌ గ్రామస్తులందరినీ పలుకరిస్తూ ఉత్సాహంగా గడిపారు.