తెలంగాణపై కన్నేసిన బీజేపీ : రంగంలోకి ఆర్ఎస్ఎస్! 

  • Published By: sreehari ,Published On : December 19, 2019 / 01:33 PM IST
తెలంగాణపై కన్నేసిన బీజేపీ : రంగంలోకి ఆర్ఎస్ఎస్! 

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా చెప్పుకుంటోన్న బీజేపీ.. ఇప్పుడు క్షేత్ర స్థాయిలో బలోపేతంపై దృష్టి పెట్టింది. కాకపోతే, బీజేపీని దేశవ్యాప్తంగా లిఫ్ట్‌ చేసిన ఆర్‌ఎస్‌ఎస్సే ఇప్పుడు తెలంగాణలో కూడా ఆ బాధ్యతను భుజానకెత్తుకుందని అంటున్నారు.

అందుకే ఎప్పుడూ లేని విధంగా ఈసారి హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు విజయసంకల్ప శిబిర్ పేరుతో శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసిందంట ఆర్ఎస్‌ఎస్‌. ఈ కార్యక్రమానికి ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భగవత్‌తో పాటు ఇతర ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో బీజేపీని మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తారంటున్నారు. 

భారీ స్థాయిలో శిక్షణ శిబిరాలు :
శిక్షణ తరగతుల నేపథ్యంలో మోహన్ భగవత్ మూడు రోజులపాటు హైదరాబాద్‌లోనే మకాం వేస్తారు. తెలంగాణలో సంఘ్ సిద్ధాంతాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి? తద్వారా రాష్ట్రంపై పట్టు సాధించేందుకు ఉన్న అవకాశాలు సంఘ్ పరివార్ కార్యకర్తలకు వివరిస్తారట. రాష్ట్రానికి చెందిన బీజేపీ ప్రముఖ నేతలంతా ఈ శిబిరంలో పాల్గొంటారు.

అంతే కాకుండా 16వేల మంది సంఘ్ పరివార్ ముఖ్యనేతలు సైతం ఈ సమావేశాలకు హాజరవుతున్నారట. ముఖ్య నేతలు అంతా ఆర్ఎస్‌ఎస్‌ డ్రస్ కోడ్‌లో దర్శనం ఇవ్వనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత భారీ స్థాయిలో ఆరెస్సెస్ శిబిరాలు ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ఆరెస్సెస్ శిబిరాలు బీజేపీకి, అనుబంధం సంఘాల బలోపేతానికి మరింత ఊతమిస్తాయని బీజేపీ భావిస్తోంది. 

టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా :
ఆర్ఎస్‌ఎస్‌ ప్రోత్సాహంతోనే బీజేపీ దేశంలో వేళ్లూనుకుంది. ఇప్పుడు అదే ఫార్ములాను తెలంగాణలోనూ అనుసరించాలనే ఉద్దేశంలో ఉందట. ఎలాగైనా తెలంగాణ రాష్ట్రాన్ని తమ పాలనలోకి తీసుకు రావాలని భావిస్తోందని అంటున్నారు. ఇటీవల కాలంలో పలు సందర్భాల్లో బీజేపీ నేతలు కూడా తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని చెబుతూ ఊదరగొడుతున్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలుచుకున్న తర్వాత ఈ ఊపు మరింత ఎక్కువైందంటున్నారు. ఎలాగైనా సరే తెలంగాణలో జెండా పాతాల్సిందేననే పట్టుదలతో పార్టీ ఢిల్లీ పెద్దలు ఉన్నారని చెబుతున్నారు. ఇందుకు ఆర్ఎస్‌ఎస్‌ కూడా తోడైతే ఇక తిరుగుండదనే ఉద్దేశంలో ఉన్నారని జనాలు అంటున్నారు.