ప్రొటెం స్పీకర్ అహ్మద్ ఖాన్ : ప్రమాణం చేయను – రాజాసింగ్

  • Published By: madhu ,Published On : January 7, 2019 / 03:42 AM IST
ప్రొటెం స్పీకర్ అహ్మద్ ఖాన్ : ప్రమాణం చేయను – రాజాసింగ్

హైదరాబాద్ : కాంట్రవర్సికీ కేరాఫ్ అడ్రస్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్..ఈయన మరో వివాదానికి తెరలేపారు. అసెంబ్లీకి రాను..ఆయనుంటే ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనని రాజా సింగ్ వెల్లడించారు. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుండి రాజా సింగ్ ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ నుండి గెలిచింది ఆయనొక్కరే. ప్రజలు గెలిపిస్తే..ఆయన మాత్రం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణం చేయనని రాజాసింగ్ ప్రకటించారు. ఇందుకు కారణం ఉందండోయ్…ప్రొటెం స్పీకర్‌గా అహ్మద్ ఖాన్ ఉండడం ఆయనకిష్టంలేదు. ఎంఐఎం..బీజేపీ పార్టీల మధ్య నిత్యం యుద్ధం జరుగుతూనే ఉంటుందనే సంగతి తెలిసిందే. 
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కొద్ది రోజుల్లో జరుగనున్నాయి. ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ ఖాన్ నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై రాజా సింగ్ స్పందించారు. స్పీకర్ ఎంపిక తరువాతే ప్రమాణం చేస్తానని స్పష్టం చేశారు. అవసరమని అనుకుంటే అసెంబ్లీకే రానని…న్యాయపరమైన సమస్యలు ఉంటే ఎదుర్కొంటానని అన్నారు. కేసీఆర్ నిజాం వారసుడిగా, ఎంఐఎం మద్దతుదారుగా ప్రవర్తిస్తున్నారని రాజాసింగ్ విమర్శించారు. ఎంఐఎం ఎమ్మెల్యేను తెలంగాణ ప్రొటెం స్పీకర్‌గా నియమించడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.