పార్లమెంటులోనూ పరాభవమే : బీజేపీ ఫ్యూచర్ చెప్పిన కేటీఆర్

  • Published By: veegamteam ,Published On : January 5, 2019 / 11:59 AM IST
పార్లమెంటులోనూ పరాభవమే : బీజేపీ ఫ్యూచర్ చెప్పిన కేటీఆర్

హైదరాబాద్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణపై కేంద్రం తీవ్ర వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. తాగు, సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో తీరని అన్యాయం చేస్తోందన్నారు. తెలంగాణలో బీజేపీ ఉనికి లేదనే కారణంతో మన ప్రాజెక్టులకు నిధులివ్వడం లేదన్నారు. కేంద్రం ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోకపోతే తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లోనూ బీజేపీకి పరాభవం తప్పదని కేటీఆర్ హెచ్చరించారు. కేంద్రం వైఖరి కారణంగానే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదని గుర్తు చేశారు.
సవతి తల్లి ప్రేమ:
తెలంగాణ బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. మిషన్ కాకతీయ, భగీరథలకు కేంద్రం నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకు కేంద్రం భారీగా నిధులు ఇస్తోందన్నారు. తెలంగాణలో తాగు, సాగు నీటి ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని కేంద్రం.. మహారాష్ట్ర ప్రభుత్వం అడిగిన వెంటనే అక్కడి ప్రాజెక్టులకు 25శాతం నిధులు ఇచ్చేందుకు అంగీకారం తెలిపిందన్నారు. అన్ని రాష్ట్రాలను ఒకేలా చూడాలన్న స్పృహ కేంద్రానికి లేదన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో కనీసం ఒక్కదానికైనా జాతీయ హోదా ఇవ్వమని అడిగితే కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు.
మోడీ కాపీ క్యాట్:
విభజన చట్టం అమలులోనూ తెలంగాణకు కేంద్రం తీరని అన్యాయం చేసిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహార శైలి చాలా బాధాకరం అన్నారు. మోడీ కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలకు ప్రధానమంత్రా? అని ప్రశ్నించారు. తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొడుతోందని కేటీఆర్ ఆరోపించారు. రైతు బంధు పేరు మార్చి ఎన్నికల్లో లబ్దిపొందాలని బీజేపీ చూస్తోందన్నారు.