కరోనా కష్టకాలంలో…ఉద్యోగులకు జీతాలు పెంచిన ఐటీ కంపెనీ

  • Published By: venkaiahnaidu ,Published On : April 17, 2020 / 08:55 AM IST
కరోనా కష్టకాలంలో…ఉద్యోగులకు జీతాలు పెంచిన ఐటీ కంపెనీ

కరోనావైరస్ కష్టకాలంలో ఉద్యోగులకు తీపికబురు అందించింది ఫ్రెంచ్ ఐటీ సర్వీసుల కంపెనీ క్యాప్ జెమినీ. లాక్ డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోతున్న ఐటీ కంపెనీలు ఇప్పటికే పలు చోట్ల ఉద్యోగులను తొలగిస్తున్నట్లు,జీతాల చెల్లింపులో కోతలు విధిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న సమయంలో క్యాప్ జెమీనీ చేసిన పని అందరినీ ఆశ్చర్యపర్చింది.

భారతదేశంలోని క్యాప్ జెమినీ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న 70 శాతం సిబ్బంది(84వేల మంది)కి ఏప్రిల్ 1,2020నుంచి నుంచి జీతభత్యాలు పెంచాలని నిర్ణయించారు. మిగిలిన ఉద్యోగులకు కూడా జులై నెల నుంచి ఇంక్రిమెంట్లు ఇవ్వాలని క్యాప్ జెమినీ ఇండియా యాజమాన్యం నిర్ణయించింది. జీతాలు పెంచడం తో క్యాప్‌ జెమినీ ఉద్యోగుల్లో సంతోషానికి అవధుల్లేవు.

అంతే కాకుండా ప్రస్తుత లాక్‌డౌన్ కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ఉద్యోగులకు రూ.10,000 క్యాష్ అలవెన్స్ కూడా ప్రకటించింది క్యాప్ జెమినీ. మార్చి రెండో వారంలోనే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికి, విషయం బయటకు తెలిసే సరికి కాస్త ఆలస్యం అయింది. కేవలం ప్రాజెక్టుల్లో పనిచేసే వారికి మాత్రమే కాకుండా బెంచ్ ఉద్యోగులకు కూడా ఈ కంపెనీ జీతాలను అందిస్తుంది.

ప్రాజెక్టులు లేని బెంచ్ మీద ఉన్న ఉద్యోగులను నిలుపుకునేందుకు వీలుగా వారికి కూడా జీతాలు చెల్లించాలని కంపెనీ నిర్ణయించింది. బెంచ్ టైమ్ తో సంబంధం లేకుండా ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తామని క్యాప్ జెమినీ ఇండియా సీఈఓ అశ్విన్ యార్డీ వివరించారు. ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులకు షిఫ్ట్ అలవెన్సును ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది. మొత్తం ఉద్యోగులలో 95% మందికి ఇది వర్తిస్తుంది. దీంతోపాటు ఏప్రిల్ నెలలో ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రమోషన్లు జులై 1 నుంచి అమలు చేస్తామని కంపెనీ సీఈఓ ప్రకటించారు.