దేశంలోనే బెస్ట్ : ఉత్తమ దర్యాప్తు అధికారిగా ఏసీపీ రంగారావు

  • Published By: madhu ,Published On : March 2, 2019 / 02:47 AM IST
దేశంలోనే బెస్ట్ : ఉత్తమ దర్యాప్తు అధికారిగా ఏసీపీ రంగారావు

దర్యాప్తు సంస్థల్లో ఉన్న అధికారుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ఏడాదిలోనే దీనిని ప్రారంభించింది. తొలి అవార్డు హైదరాబాద్ పోలీసు విభాగంలోని ఏసీపీ ఎస్. రంగారావుకు దక్కింది. ప్రస్తుతం స్పెషల్ బ్రాంచీలో పని చేస్తున్నారు. అవార్డు రావడం పట్ల నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సంతోషం వ్యక్తం చేశారు. నగర పోలీసు కమిషనర్ ఆఫీసులో రంగారావును మార్చి 01వ తేదీ శుక్రవారం అభినందించారు. ఈ సందర్భంగా ఏసీపీ రంగారావు కేసు వివరాలను ఆయన వెల్లడించారు. 

రంగారావు బేగంపేట ఏసీపీగా ఉన్న సమయంలో 2016లో 9 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసు దర్యాప్తునకు ఈ అవార్డు లభించిందన్నారు. 2016 జులై 2 సాయంత్రం కల్లుకౌంపౌండ్‌కు తల్లిదండ్రులతో వెళ్లిన చిన్నారిని అనీల్ అనే వ్యక్తి మాయమాటలు చెప్పి తీసుకపోయాడు. అల్వాల్‌లోని కాలవేరి బ్యారెక్ సమీపంలో చిన్నారిపై అత్యాచారం చేసి చంపేశాడు. ఈ కేసులో నిందితుడు అనీల్ కోసం ఏసీపీ రంగారావు ఆరా తీశారు. అతడిని పట్టుకోవడంతో పాటు నేర చరిత్రను బయటకు తీశారు. అనీల్ పై అల్వాల్ పీఎస్ పరిధిలో 15 చోరీలు, రెండు హత్య కేసులున్నాయని గుర్తించారని అంజనీకుమార్ తెలిపారు. 

చిన్నారిని పాశవికంగా చిదిమేసిన వ్యక్తికి కఠినంగా శిక్ష పడాలని అనుకున్నట్లు, దర్యాప్తులో ఎక్కడా చిన్నలోపం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ఏసీపీ రంగారావు పేర్కొన్నారు. ఫోరెన్సిక్ లెబొరేటరికి పలు నమూనాలు పంపించి అతడే నిందితుడని నిర్ధారణకు వచ్చినట్లు, చట్టంలో ఉన్న అవకాశం సద్వినియోగం చేసుకుంటూ అతగాడి నేరచరిత్రను సవివరంగా కోర్టు దృష్టిలో ఉంచినట్లు వెల్లడించారు. అనీల్ దోషిగా కోర్టు నిర్ధారించిందని, జీవిత ఖైదు విధించిందన్నారు. ప్రతిష్టాత్మకమైన అవార్డు రావడం బాధ్యతను మరింత పెంచిందన్నారు ఏసీపీ రంగారావు.