విన్నపాలు వినవలె : కేసీఆర్..జగన్ హస్తినబాట

  • Published By: madhu ,Published On : October 3, 2019 / 01:09 AM IST
విన్నపాలు వినవలె : కేసీఆర్..జగన్ హస్తినబాట

తెలుగు రాష్ట్రాల సీఎంలు హస్తిన బాట పట్టనున్నారు. ఇద్దరూ ఒకరోజు వ్యవధిలో ప్రధానితో భేటీ కానుండడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అక్టోబర్ 03వ తేదీ గురువారం హస్తినకు వెళ్లనున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌.. అక్టోబర్ 04వ తేదీ శుక్రవారం ప్రధానితో సమావేశం కానున్నారు. 

రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. సీఎం కేసీఆర్ గతేడాది డిసెంబర్‌లో ప్రధాని మోడీని కలిశారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో.. మోడీ రెండోసారి ప్రధాని పీఠాన్ని అధిష్టించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు నమోతో.. సీఎం సమావేశం కాలేదు. అందుకే.. వీరిద్దరి మధ్య జరగబోయే భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. పార్లమెంట్ ఎన్నికల్లో.. అఖండ విజయం సాధించిన మోడీకి అభినందనలు తెలుపుతూనే.. సీఎం కేసీఆర్ రాష్ట్ర సమస్యలు ప్రస్తావించే అవకాశాలున్నాయి. తెలంగాణ ప్రభుత్వం.. కేంద్రం ముందు తరచూ ప్రస్తావిస్తున్న అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని.. ప్రధానిని .. సీఎం కేసీఆర్ కోరనున్నట్లు తెలుస్తోంది.

కాళేశ్వరం ప్రాజెక్టును.. పూర్తి చేయడంతో పాటు వాటి ఫలాలు ప్రజలకు అందుతున్నాయన్న విషయాన్ని సీఎం..ప్రధానికి వివరించనున్నట్లు సమాచారం. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు గానీ.. కాళేశ్వరం ప్రాజెక్టుకుకు గానీ.. జాతీయ హోదా కల్పించాలన్న డిమాండ్ తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుంచో చేస్తోంది. ఈ విషయాన్ని కూడా సీఎం కేసీఆర్‌ ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమచారం. ఇక నదుల అనుసంధానం విషయంలో.. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇప్పటికే పలు మార్లు సమావేశమయ్యారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానానికి.. కేంద్రం సహకరించాలని ప్రధానిని ఈ భేటీలో కోరే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్, సీఎం జగన్.. ఇద్దరూ అపెక్స్ కమిటీ ముందు నదుల అనుసంధానం, జల వివాదాల పరిష్కారంపై.. చర్చించే అవకాశం ఉంది. 

ఇటు ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా ఈనెల 5న ఢిల్లీలో పర్యటించనున్నారు. అదే రోజు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. మోదీతో భేటీలో ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు సహా పలు అంశాలపై చర్చించే అవకాశముంది. ఆగస్టు 6న ప్రధాని మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షాతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు సీఎం జగన్. ఇక రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్‌ 15న ప్రారంభించనున్న వైఎస్సార్‌ రైతు భరోసా కార్యక్రమానికి ప్రధాని మోడీని సీఎం వైఎస్‌ జగన్‌ ఆహ్వానించనున్నట్లు సమాచారం.
Read More : టైం ఇవ్వండి : స్కూళ్లు, ఆస్పత్రుల రూపురేఖలు మార్చేస్తా – సీఎం జగన్