ఢిల్లీ టూర్ -2 : కేసీఆర్‌పై మోడీ ప్రశంసలు!

  • Published By: madhu ,Published On : December 13, 2020 / 07:05 AM IST
ఢిల్లీ టూర్ -2 : కేసీఆర్‌పై మోడీ ప్రశంసలు!

CM KCR Delhi Tour : తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా మొదటి రోజు కేంద్రమంత్రులు అమిత్‌షా, గజేంద్రిసింగ్‌ షెకావత్‌లో భేటీ అయిన కేసీఆర్‌… శనివారం ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర పౌరవిమానయానశాఖమంత్రి హర్దీప్‌సింగ్‌ను కలిశారు. మోదీతో 45నిమిషాలపాటు సమావేశమైన కేసీఆర్‌… రాష్ట్రానికి అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లిందని, వరద సాయంగా తాము అడిగిన 1350 కోట్లను అందించాలని కోరారు. హైదరాబాద్‌లో గత శతాబ్ద కాలంలో కనీవినీ ఎరుగని రీతిలో భారీ వర్షాలు కురిశాయని, అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని, లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారని సీఎం కేసీఆర్‌ వివరించారు.

కేసీఆర్‌పై ప్రశంసలు :-
తెలంగాణ రాష్ట్రం వివిధ రంగాల్లో పురోగమిస్తున్న తీరుపై ప్రధానమంత్రి మోదీ.. కేసీఆర్‌పై ప్రశంసలు కూడా కురిపించినట్టుగా తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన అమెజాన్‌, గూగుల్‌, యాపిల్‌ వంటి కంపెనీలు తమ ద్వితీయ మజిలీగా హైదరాబాద్‌ను ఎంపిక చేసుకోవటంపై కేసీఆర్‌ను మోదీ అభినందించారు. టీఎస్‌-బీపాస్‌ కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తున్నది. మరోవైపు కరోనా కట్టడికి అనుసరించాల్సిన విధానంపై ఇరువురు చర్చించినట్టు తెలిసింది. సీఎం కేసీఆర్‌ సైతం ప్రధానిని సెంట్రల్‌ విస్టా విషయంలో అభినందినించినట్టు తెలుస్తోంది. సెంట్రల్‌ విస్టా దేశానికే గర్వకారణంగా నిలిచే సౌధం అవుతుందని ఇటీవల ప్రశంసించిన సీఎం కేసీఆర్‌, అదే విషయాన్ని ప్రధానితో నేరుగా చెప్పినట్టుగా సీఎంవో వర్గాలు తెలిపాయి.

పలు అంశాలపై చర్చ :-
గోదావరి, కృష్ణా జలాల వినియోగం, న్యాయంగా తెలంగాణకు దక్కాల్సిన వాటాపైనా మోదీతో కేసీఆర్‌ చర్చించినట్టు తెలుస్తోంది. జీఎస్టీ బకాయిలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, ఈ విషయంలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించాలని కోరినట్టు సమాచారం. తాము అమలుచేస్తున్న మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలకు 24 వేల కోట్లు కేంద్రం ఇవ్వాలని నీతిఆయోగ్‌ సిఫారసు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరిన సీఎం, పాలమూరు రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు సహకారమందించాలని కూడా విజ్ఞప్తి చేశారు.

కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్‌తో :-
ప్రధానితో భేటీకి ముందు కేసీఆర్‌.. కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురిని కలిశారు. తెలంగాణలో ఆరు విమానాశ్రయాల ఏర్పాటుకు అనుమతులిచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కేసీఆర్‌ కేంద్రమంత్రిని కోరారు. వరంగల్‌ జిల్లాలోని మామునూర్‌, పెద్దపల్లి జిల్లాలోని బసంత్‌నగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని విమానాశ్రయాలను పునరుద్ధరించాలని కోరారు. కొత్తగా నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, భద్రాద్రి కొత్తగూడెంలో విమానాశ్రయాలు ఏర్పాటుచేయాలని విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ ఒక వినతిపత్రాన్ని కేంద్రమంత్రికి అందజేశారు. సాధ్యమైనంత తొందరగా విమానాశ్రయాల ఏర్పాటుకు అనుమతులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇందుకు కావలసిన అన్ని లాంఛనాలను పూర్తిచేస్తుందని సీఎం కేసీఆర్‌ వివరించారు. ప్రతిపాదిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తుందని చెప్పారు.