CM KCR National Party: అప్పట్లో ఎన్టీఆర్.. ఇప్పుడు కేసీఆర్.. కానీ.. ప్రభావం ఎంత?

జాతీయ పార్టీగా తన పార్టీని కేసీఆర్ ఎలా ముందుకు నడించగలరన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకు ముందు కూడా కొందరు ప్రాంతీయ పార్టీలను జాతీయ పార్టీలుగా ప్రకటించారు. అయితే, రాష్ట్ర స్థాయిలో రాణించినట్లు జాతీయ స్థాయిలో రాణించలేకపోయారు. ఇప్పటివరకు ప్రాంతీయ పార్టీ నేతగానే కేసీఆర్ కు పేరుంది. ఇప్పుడు ఆయన జాతీయ స్థాయిలో రాణిస్తారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో సీనియర్ ఎన్టీఆర్ కూడా తెలుగు దేశం పార్టీని స్థాపించి ఉమ్మడి ఏపీలో తిరుగులేని నేతగా ఎదిగి, 'భారత్ దేశం' పేరుతో పార్టీ పెట్టాలనుకున్నారు. అయితే, అది కార్యరూపం దాల్చలేదు.

CM KCR National Party: అప్పట్లో ఎన్టీఆర్.. ఇప్పుడు కేసీఆర్.. కానీ.. ప్రభావం ఎంత?

CM KCR National Party

KCR writes letter to EC: తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ ఇవాళ టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేయడంతో సీఎం కేసీఆర్ ఇకపై దేశ రాజకీయాల్లో అడుగుపెట్టనున్నారు. ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా తన పార్టీని కేసీఆర్ ఎలా ముందుకు నడించగలరన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకు ముందు కూడా కొందరు ప్రాంతీయ పార్టీలను జాతీయ పార్టీలుగా ప్రకటించారు. అయితే, రాష్ట్ర స్థాయిలో రాణించినట్లు జాతీయ స్థాయిలో రాణించలేకపోయారు.

ఇప్పటివరకు ప్రాంతీయ పార్టీ నేతగానే కేసీఆర్ కు పేరుంది. ఇప్పుడు ఆయన జాతీయ స్థాయిలో రాణిస్తారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో సీనియర్ ఎన్టీఆర్ కూడా తెలుగు దేశం పార్టీని స్థాపించి ఉమ్మడి ఏపీలో తిరుగులేని నేతగా ఎదిగి, ‘భారత్ దేశం’ పేరుతో పార్టీ పెట్టాలనుకున్నారు. అయితే, అది కార్యరూపం దాల్చలేదు. కేసీఆర్ మాత్రం బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతుండడం, అందుకు ప్రణాళికలు రచించుకోవడంతో ఎన్టీఆర్ గతంలో చేసిన ప్రయత్నాలు గుర్తుకువస్తున్నాయి.

అప్పట్లో ఎన్టీఆర్‌ జాతీయ రాజకీయాల్లో రాణించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ఓ ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా రూపుదిద్దుకునే అవకాశం, హక్కు భారత్ లో ఉంది. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే చక్రం తిప్పుతున్నాయి. దేశంలో కాంగ్రెస్ తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న సమయంలో బీజేపీకి చాలా తక్కువ సీట్లు ఉండేవి. అయినప్పటికీ బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా బాగా రాణించింది. ఇప్పుడు బీజేపీ తిరుగులేని ఆధిపత్యాన్ని కనబర్చుతోంది. కాంగ్రెస్‌ మాత్రం అంతగా బలంగా లేదు.

బలహీన విపక్షంగా పేరు తెచ్చుకుంటోంది. ఈ సమయంలో ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో ప్రాభవం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఇప్పుడు కేసీఆర్ మరింత దూకుడుగా చేస్తుండడం చర్చనీయాంశం అవుతోంది. ఎన్టీఆర్ కి దక్షిణ భారత్ లోనే కాకుండా ఉత్తరాదిన కూడా అప్పట్లో మంచి పేరు వచ్చింది. ఇప్పటివరకు అంతటి పేరు తెచ్చుకునే నేత లేరు. అప్పట్లో జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడంతో ఎన్టీఆర్ కి ఎదురైన అనుభవాలు ఇప్పుడు కేసీఆర్ కు కూడా ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు.

ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ ఈ ముగ్గురు నాయకులు మాత్రమే జాతీయ రాజకీయాలపై ఆసక్తి కనపర్చారు. కాంగ్రెస్ నేతలు వారి పార్టీ తరఫున పనిచేశారు కాబట్టి వారిని ఈ ముగ్గురు నేతలతో పోల్చలేం. ఇక ఏపీ సీఎం జగన్‌ జాతీయ రాజకీయాలపై ఇప్పట్లో అడుగుపెట్టే అవకాశాలు కనపడట్లేదు. దక్షిణాది రాష్ట్రాలు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే, కూటములతో ఆ పార్టీలు జాతీయ స్థాయి రాజకీయాలు చేశాయి. ప్రాంతీయ పార్టీగా పురుడుపోసుకుని జాతీయ పార్టీగా ఎదిగిన కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీలు దేశంలోనే లేవు.

ఇక తెలంగాణ మినహా మిగతా రాష్ట్రాల్లో కేసీఆర్ పార్టీకి ఇప్పుడు ఏ మాత్రం బలం లేదు. అయినప్పటికీ ఆయన అనుబంధ సంఘాల సాయంతో ఇతర రాష్ట్రాల్లోనూ రాణించాలని అనుకుంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా బీఆర్ఎస్ ను బలపర్చుతామని అంటున్నారు. రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కొన్ని రాష్ట్రాలకు మాత్రమే అనుకూలంగా వ్యవహరిస్తోందని, అలాగే, దేశానికి సంబంధించిన అంశాలపై జాతీయ పార్టీల వైఖరి సరిగ్గాలేదని కేసీఆర్ అంటున్నారు.

అసలు కేసీఆర్ ఆలోచన అంతా జాతీయ పార్టీగా తమ పార్టీని కొనసాగిస్తూనే దేశంలోని మిగతా ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయాలన్నదానిపైనే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో విజయం సాధిస్తే తిరుగు ఉండదు. అయితే, ఆ ప్రయత్నాలు ఎంతవరకు విజయవంతం అవుతాయన్నదే ప్రశ్న. ఇప్పటికే కేసీఆర్ దాదాపు దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులను కలిశారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు కేవలం సమావేశాలు పెట్టడం, ఆ తర్వాత ప్రతిపక్షాల ఐక్యత గురించి మర్చిపోవడం వంటి తంతు రిపీట్ అవుతూ ఉంది.

ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలను కలుపుకోకుండా సొంతంగా దేశంలో తమ పార్టీని బలోపేతం చేసుకుని, లోక్ సభ ఎన్నికల్లో రాణించే అవకాశాలు లేవు. జాతీయ పార్టీగా ప్రకటించినప్పటికీ తెలంగాణపైనే అధికంగా ఆ పార్టీ నేతల దృష్టి ఉంటుంది. దేశంలో పొత్తులతో బీఆర్ఎస్ పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. దక్షిణాదిలోని పార్టీలతోనే కాకుండా ఉత్తర భారత్ లోని చిన్న పార్టీలతో బీఆర్ఎస్ పొత్తులు కుదుర్చుకుని పోటీ చేయొచ్చు. ముఖ్యంగా నిధుల కొరత ఉన్న పార్టీలతో బీఆర్ఎస్ పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం టీఆర్ఎస్ ఆర్థికంగా బలంగా ఉంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..