ఢిల్లీని శాసిద్దాం : 16 ఎంపీ స్థానాల్లో గెలుపుకు టీఆర్ఎస్ ప్లాన్

  • Edited By: madhu , February 24, 2019 / 01:47 PM IST
ఢిల్లీని శాసిద్దాం : 16 ఎంపీ స్థానాల్లో గెలుపుకు టీఆర్ఎస్ ప్లాన్

16 ఎంపీ సీట్లను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న టీఆర్ఎస్‌.. ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టింది. మార్చి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉందని టీఆర్ఎస్‌ పార్టీ అంచనా వేస్తోంది. మార్చి ఫ్టస్ వీక్ నుండి పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా సమావేశాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సమావేశాలు 11 వరకు నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన వెంటనే ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. సమావేశాలకు ముఖ్యఅతిథిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. 

ప్రస్తుతం 11  స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 16 లోక్‌సభ స్థానాల్లో టీఆర్ఎస్‌ పార్టీ సర్వేలు చేయిస్తోంది. సర్వే నివేదికల ఆధారంగానే.. సీఎం కేసీఆర్ పార్లమెంట్ అభ్యర్థులను ఖరారు చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2, 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చే అవకాశాలు కూడా ఉన్నాయని చర్చ జరుగుతోంది. ఢిల్లీని శాసిద్దాం అన్న నినాదంతో ఎన్నికలకు వెళ్లాలని టీఆర్ఎస్‌ పార్టీ యోచిస్తున్నట్టు సమాచారం. అటు  జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు స్పష్టమైన మెజారిటీ వచ్చే పరిస్థితి లేదని టిఆర్ఎస్ అంచనా వేస్తోంది. తెలంగాణలో 16 లోక్‌సభ స్థానాలు గెలిచి ఢిల్లీలో చక్రం తిప్పాలని భావిస్తున్న సీఎం కేసీఆర్.. అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.