సీఎం కేసీఆర్ ఆదేశం : గూడ్స్ రైళ్ల ద్వారా జిల్లాలకు యూరియా తరలింపు

  • Published By: madhu ,Published On : September 6, 2019 / 01:07 PM IST
సీఎం కేసీఆర్ ఆదేశం : గూడ్స్ రైళ్ల ద్వారా జిల్లాలకు యూరియా తరలింపు

తెలంగాణ రాష్ట్రంలో యూరియాల కోసం రైతన్నలు పడుతున్న కష్టాలపై సీఎం కేసీఆర్ స్పందించారు. సెప్టెంబర్ 06వ తేదీ శుక్రవారం వ్యవసాయశాఖపై రివ్యూ నిర్వహించారు. యూరియా పంపిణీల్లో తలెత్తిన సమస్యల పరిష్కార మార్గాలపై చర్చించారు. పంటల విస్తీర్ణం పెరగడం వల్ల యూరియాకు డిమాండ్ పెరిగిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆగస్టు చివరి నాటికి 6 లక్షల టన్నుల యూరియా రైతులకు చేరిందన్నారు.

డైరెక్టర్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ విధానం ద్వారా రైతులకు ఎరువులు అందివ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని.. దీంతో ప్రైవేట్ కంపెనీలకు ఎక్కువ ఎరువులు తెప్పించలేదన్నారు. డిమాండ్‌కు అనుగుణంగా వివిధ కంపెనీలకు యూరియా ఆర్డర్ పెట్టామని, షిప్పుల ద్వారా యూరియా రావడంలో ఆలస్యమౌతోందని సీఎం కేసీఆర్‌కు అధికారులు వివరించారు. వెంటనే సౌత్ సెంట్రల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్‌తో ఫోన్‌లో మాట్లాడారు.

యూరియా స్టాక్‌ను తెలంగాణ జిల్లాలకు తరలించేందుకు 25 ప్రత్యేక గూడ్స్ రైళ్లను కేటాయించాలని కోరారు. వెంటనే రైల్వే అధికారులు గూడ్స్ రైళ్లను కేటాయించారు. త్వరగా యూరియా తెప్పించి గ్రామాలకు సరఫరా చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. మూడు, నాలుగు రోజుల్లో ఎంత డిమాండ్ ఉందో తెలుసుకుని.. సరిపడా ఎరువులను రైతులకు అందజేయాలని సూచించారు. నిల్వలను వెంటనే రైళ్లు.. లారీల ద్వారా గ్రామాలకు తరలించేందుకు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.