ఆర్టీసీ సమ్మె..వాట్ నెక్ట్స్ : సుప్రీంకు వెళ్లే యోచన!

  • Edited By: madhu , November 10, 2019 / 01:01 AM IST
ఆర్టీసీ సమ్మె..వాట్ నెక్ట్స్ : సుప్రీంకు వెళ్లే యోచన!

ఆర్టీసీ సమ్మెపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దాదాపు రెండు గంటలకు పైగా ఈ సమీక్ష జరిగింది. 2019, నవంబర్ 10వ తేదీ శనివారం ఈ సమావేశం జరిగింది. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా ఇరు వర్గాలు ఒక మెట్టు దిగి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలంటూ హైకోర్టు ధర్మాసనం సూచించగా.. ఈ విషయంలో ప్రభుత్వం చేయాల్సింది ఏమీ లేదంటూ కేసీఆర్‌ నిస్సహాయతను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ప్రతిసారీ ప్రభుత్వానివే తప్పుడు లెక్కలంటూ కోర్టు వ్యాఖ్యానిస్తోందని. చివరకు ఐఏఎస్‌ అధికారులు హాజరై వివరణలు ఇచ్చినా సంతృప్తి చెందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా ఆర్టీసీకి చట్టబద్ధత లేదనడం విస్మయం కలిగిస్తోందని… చట్టబద్ధత లేకపోతే ఇన్ని రోజులుగా సంస్థ ఎలా నడుస్తోందని సీఎం అన్నట్లు సమాచారం. మరోపక్క కార్మికులు కూడా మెట్టు దిగడంలేదని కేసీఆర్‌ గుర్తు చేశారు. ఇప్పటికే ఐఏఎస్‌ల కమిటీ వేసి చర్చలు జరిపామని… పండుగ ముందు సమ్మెకు వెళ్లవద్దని సూచించినా కార్మికులు వినలేదన్నారు.

ఈడీల కమిటీ వేసి కోర్టు సూచించిన 21 డిమాండ్లపై చర్చిస్తామని చెప్పినా పట్టించుకోకుండా సమ్మెకు వెళ్లారని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం చేతుల్లో ఏమీ లేదని కోర్టుకు వివరించాలని అధికారులకు సూచించారు. హైకోర్టు తీర్పును చూశాక… వ్యతిరేకంగా వస్తే సుప్రీం కోర్టుకు వెళ్లే ఆలోచన చేద్దామని కేసీఆర్‌ అన్నట్లు తెలిసింది.
Read More : ఆర్టీసీ కార్మికులు మావోయిస్టులతో చేతులు కలిపారు : సీపీ సంచలన వ్యాఖ్యలు