కామన్ ట్రావెల్ కార్డ్ : ప్రయాణం మరింత సుఖవంతం

  • Published By: madhu ,Published On : February 9, 2019 / 02:01 PM IST
కామన్ ట్రావెల్ కార్డ్ : ప్రయాణం మరింత సుఖవంతం

హైదరాబాద్ : జంట నగరాల్లో ప్రజా రవాణ వ్యవస్థలన్నింటికీ కలిపి కామన్‌ ట్రావెల్‌ కార్డ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు  ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్టీసీ, మెట్రో, ఎంఎంటీఎస్‌, క్యాబ్‌లలో ప్రయాణానికి ఒకే కార్డు ద్వారా చెల్లింపులు చేసేందుకు సన్నాహాలు ముమ్మరమయ్యాయి. ఈ రవాణ సంస్థల మధ్య ఒప్పందం కుదిరితే ప్రయాణం మరింత సుఖవంతం అవుతుందని భావిస్తున్నారు. జంట నగరాల్లో ప్రయాణానికి కామన్‌ ట్రావెల్‌ కార్డ్‌పై 10tv ప్రత్యేక కథనం.

జంట నగరాలు బహుముఖంగా విస్తరిస్తున్నాయి. హైదరాబాద్‌ విశ్వనగరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఒక ప్రాంతం నుంచి మరో చోటుకు వెళ్లాలంటే ఆర్టీసీ బస్‌లు, ఎంఎంటీఎస్‌, మెట్రో రైళ్లతోపాటు క్యాబ్‌లు, ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. వీటికి వేర్వేరుగా నగదు చెల్లించాల్సి వస్తోంది. వీటన్నింటికీ కలిపి ఉమ్మడి  ట్రావెల్‌ కార్డు తీసుకొస్తే ప్రయాణంలో టెన్షన్‌ తగ్గుతుందన్న ఆలోచనతో అధికారులు ఈ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కామన్‌ ట్రావెల్‌ కార్డ్‌తో ప్రజారవాణ వ్యవస్థ మరింత చేరువ అవుతుందని భావిస్తున్నారు. 

* కామన్‌ ట్రావెల్‌ కార్డ్‌కు వడివడిగా అడుగులు 
* ప్రాథమిక చర్చలు జరిపిన ఆయా సంస్థల అధికారులు 
* కామన్‌ ట్రావెల్‌ కార్డ్‌కు ఎంఎంటీఎస్‌, క్యాబ్‌ల సుముఖత 
* సొంత కార్డ్‌ను అందుబాటులోకి తెచ్చిన మెట్రో రైల్‌ 

కామన్‌ ట్రావెల్‌ కార్డు తీసుకొచ్చేందుకు తెలంగాణ ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఆర్టీసీ, మెట్రో, ఎంఎంటీఎస్‌, క్యాబ్‌లు, ఆటోల్లో ప్రయాణానికి చెల్లుబాటు అయ్యేలా ఉమ్మడి కార్డు ప్రవేశపెట్టేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఆయా సంస్థల ఉన్నతాధికారులు…తెలంగాణ సర్కార్‌తో ప్రాథమిక చర్చలు జరిపారు. వీటిని మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రతిపాదించారు. కామన్‌ ట్రావెల్‌ కార్డ్‌కు ఎంఎంటీఎస్‌తోపాటు క్యాబ్‌ నిర్వాహకులు సుముఖత వ్యక్తం చేసినా… మెట్రో రైల్‌ ఇంకా ముందుకురాలేదు. రోజువారీ ప్రయాణికుల కోసం సొంత కార్డును అందుబాటులోకి తీసుకొచ్చిన మెట్రో రైల్‌ అధికారులు.. కామన్‌ కార్డ్‌పై  దృష్టి పెట్టలేదు. హైదరాబాద్‌ మెట్రో అధికారులు అంగీకరిస్తే.. కామన్‌ ట్రావెల్‌ కార్డ్‌ త్వరలోనే కార్యరూపం దాల్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.