కేసీఆర్ పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు : మర్రి శశిధర్ రెడ్డి 

  • Published By: chvmurthy ,Published On : March 29, 2019 / 04:02 PM IST
కేసీఆర్ పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు : మర్రి శశిధర్ రెడ్డి 

ఢిల్లీ : ముఖ్యమంత్రి కేసీఆర్  మంచిర్యాల జిల్లాకు చెందిన శరత్ అనే రైతుతో 17 నిమిషాలు ఫోన్ లో మాట్లాడి, అది లైవ్ లో ప్రసారం అయ్యేలా రికార్డు చేసి, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి  కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో  కూడా కేసీఆర్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆయన తెలిపారు. అప్పుడు సీఎం క్యాంప్ కార్యాలయంలో  కాంగ్రెస్ నేతలకు కండువాలు కప్పడంతో ఈసీ నోటీసులు ఇచ్చిందని మర్రి గుర్తు చేశారు. 

కేసీఆర్ చట్టాలను లెక్క చేయని అనేక సందర్భాల్లో ఈసీ కి ఫిర్యాదు చేస్తూ వస్తున్నామని ఆయన చెప్పారు. ఇటీవల ఫేసుబుక్  లో వైరల్ అయిన వీడియోకు స్పందించి… నందులపల్లికి చెందిన రైతుతో మాట్లాడి కేసీఆర్ ఒక పెద్ద డ్రామా ఆడారని ఆయన  ఆరోపించారు. రెండు గంటల్లో కలెక్టర్ మీ దగ్గరకు వస్తారని చెప్పడం, దాన్ని సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం సిగ్గుచేటని అన్నారు. ఆ కలెక్టర్.. సీఈఓ రజత్  కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ఉన్నాకూడా హాజరు కాకుండా రైతు ఉండే నెన్నెల గ్రామానికి వెళ్లటంపై కూడా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు.