టీపీసీసీ నియామకం తర్వాత పార్టీలో ఆ ముగ్గురు డౌటే..!

టీపీసీసీ నియామకం తర్వాత పార్టీలో ఆ ముగ్గురు డౌటే..!

అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల హవానే వేరు. దశాబ్ద కాలం పాటు ఆ పార్టీ నేతలంతా జిల్లా రాజకీయలను కనుసన్నల్లో నడిపించుకోగలిగారు. ఏదైనా ఆందోళనకు పిలుపునిస్తే… పార్టీ క్యాడర్ మూకుమ్మడిగా తరలివచ్చేది. ధర్నాలు చేస్తే ఆ ప్రాంతమంతా దద్దరిల్లే పరిస్థితి ఉండేది. ఇదంతా కాంగ్రెస్ చరిత్ర మాత్రమే. రెండుసార్లు ఓటమి తర్వాత పార్టీలో అనుహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. పరాజయ పరాభవంతో నేతలంతా పార్టీ కార్యక్రమాలకు దూరమవుతుండటం… క్యాడర్ సైతం నిరాశతో భవిష్యత్‌పై బెంగతో రాజకీయాలను ఏదో అలా నడిపిస్తున్నారు.



నిజానికి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కరీంనగర్ జిల్లా కంచుకోటగా ఉండేది. రాజకీయంగా చోటు చేసుకున్న పరిణామాలతో కాంగ్రెస్ స్థానాన్ని టీఆర్ఎస్ ఆక్రమించేసింది. వరుస విజయాలతో… పూర్తి మెజారిటీతో కరీంనగర్లో టీఆర్ఎస్ దూసుకుపోతుంటే, కాంగ్రెస్ పార్టీ ఓటమి భారంతో కుమిలిపోతోంది. 2014 ఎన్నికల వరకూ కాస్త బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయింది. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను వెదుక్కోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయంటే పార్టీ గ్రాఫ్‌ ఎలాగా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు.



నేతల మధ్య సమన్వయం లేకపోవడం, పార్టీపై పెత్తనం సాధించాలనుకొనే వారి సంఖ్య పెరిగిపోవడం, వ్యక్తిగత లాభం కోసం తప్ప పార్టీ బలోపేతం గురించి పెద్దగా పట్టించుకోకపోవడంతో పార్టీ డీలా పడిపోయిందని కొందరు నేతలతో పాటు కార్యకర్తలు అనుకుంటున్నారు. జిల్లాలో టీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంటే, ఇప్పుడా స్థానాన్ని బీజేపీ ఆక్రమించేందుకు వేగంగా పావులు కదుపుతోంది. రాజకీయంగా దూకుడు పెంచి పార్టీ ప్రభావాన్ని పెంచుకునేందుకు బీజేపీ వ్యూహాలను రచిస్తోందని అంటున్నారు.



జిల్లాలో కాంగ్రెస్‌ సీనియర్ నాయకులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జీవన్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్ జిల్లాల విభజన తర్వాత ఎవరి జిల్లాలకు వారే పరిమితవడంతో ఇంత కాలం వారి అనుచరులుగా ఉన్న వారంతా అయోమయంలో పడిపోయారు. కరీంనగర్‌లో పార్టీకి మంచి చెడులకు పొన్నం ప్రభాకర్ తప్ప మరో నాయకుడు కనిపించడం లేదు. జిల్లా కేంద్రంలో ఉండి పిలుపునిస్తే తప్ప… ఆందోళనలు, నిరసనలు కొనసాగించడానికి పార్టీ శ్రేణులు కదలడం లేదు. చాలా మంది సీనియర్, జూనియర్ నేతలంతా పార్టీ పరిస్థితిని చూసి, ఇతర పార్టీలకు ఇప్పటికే వలస వెళ్లడంతో పార్టీ మరింతగా డీలా పడినట్లయిందని చెబుతున్నారు.



మాజీ మంత్రి శ్రీధర్‌బాబు పెద్దపల్లి జిల్లాకు, మరో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి జిగిత్యాల జిల్లాకే పరిమితమవుతున్నారు. పార్టీకి సంబంధించిన ముఖ్యనేతలంతా జయంతి, వర్ధంతి కార్యక్రమాలను సైతం ఘనంగా నిర్వహించేకోలేకపోతున్నారని అంటున్నారు. కాంగ్రెస్‌వాదులుగా ముద్రపడిన వారంతా తమ రాజకీయ భవిష్యత్ కోసం టీఆర్ఎస్, బీజేపీలో చేరుతున్నారు. ఇటీవల పార్టీ జిల్లా అధ్యక్షుడు కటకం మృత్యుంజయం కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరడం జిల్లాలో చర్చనీయాంశం అయ్యింది.



ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని పట్టించుకునే వారే కరువవడం, క్యాడర్‌లో ఉత్సాహం నింపే నేతలే లేకపోవడంతో వేరే పార్టీలను ఆశ్రయిస్తున్నారని అంటున్నారు. ఉమ్మడి జల్లాలో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డిలు రాబోయే రోజుల్లో ఇతర పార్టీల వైపు చూస్తే మాత్రం ఇక పార్టీకి కోలుకోలేని నష్టం కలగక తప్పదని కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇప్పటికే పార్టీ అధ్యక్ష పదవి కోసం ఎదురు చూస్తున్న ఈ ముగ్గురు ముఖ్య నేతలు టీపీసీసీ నియామకం తర్వాత ఎలా వ్యవహరిస్తారో చూడాలని గుసగుసలు వినిపిస్తున్నాయి.