ఒక్కరోజులోనే మెట్రోలో 2.25లక్షల మంది జర్నీ 

  • Published By: veegamteam ,Published On : January 2, 2019 / 04:20 AM IST
ఒక్కరోజులోనే మెట్రోలో 2.25లక్షల మంది జర్నీ 

హైదరాబాద్ : మెట్రో రైళ్లలో తొలిసారిగా ఒకే రోజు 2.25 లక్షల మంది ప్రయాణించారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా మెట్రో రైలు సేవల సమయాన్ని పొడిగించడంతో 2.25 లక్షల మంది ప్రయాణించారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి 12.30 గంటల వరకు మెట్రో రైళ్లను నడిపారు. దీంతో ఒకే రోజు మెట్రోలో ప్రయాణించిన వారి సంఖ్య తొలిసారి 2 లక్షల మార్క్ ను దాటిందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఎల్బీనగర్-అమీర్ పేట్ రూట్లలో 1.65 లక్షల మంది, నాగోల్-అమీర్ పేట్ మార్గంలో 60 వేల మంది ప్రయాణం చేసినట్లు చెప్పారు.

ప్రతిరోజు 1.50 లక్షల మంది మెట్రో రైలులో ప్రయాణిస్తున్నారు. కొత్త సంవత్సరం వేడుకులను పురస్కరించుకుని ఎల్బీనగర్-మియాపూర్, అమీర్ పేట్-నాగోల్ రూట్లలో ప్రతి ఆరు నిమిషాలకు ఒక మెట్రో రైలును నడిపారు. సాయంత్రం 5 నుంచి అర్ధరాత్రి 12.30 గంటల వరకు ప్రయాణికులతో మెట్రో రైల్వే స్టేషన్లు కిటకిటలాడాయి.

జనవరి చివరిలోగా అమీర్ పేట్-హైటెక్ సిటీ రూట్ లలో మెట్రో రైళ్లు వాణిజ్య రాకపోకలు ప్రారంభించనున్నాయి. ఇప్పటికే ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. ఈ మార్గం ప్రారంభమైతే నిత్యం నగరంలో మెట్రో ప్రయాణం చేసే వారి సంఖ్యం 3 లక్షలు దాటుందని మెట్రో రైలు అధికారులు అంటున్నారు. ఈ రూట్లలోని స్టేషన్ల నిర్మాణం, సుందరీకరణ పనులు పూర్తయ్యాయి. ఎంజీబీఎస్-ఫలక్ నుమా మెట్రో రైలు మార్గం కూడా పూర్తైతే నిత్యం మూడు మార్గాల్లో 16 లక్షల మంది మెట్రో రైళ్లలో ప్రయాణిస్తారని అధికారుల అంచనా.